Telangana News: మంత్రివర్గంలో ఖాళీలు లేవు- రేవంత్ కీలక ప్రకటన- త్వరలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ నియాకమం
Revanth Reddy: తెలంగాణలో కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్, జీవన్‌రెడ్డి అలకపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో జరగాలని చాలా మంది చూస్తున్నారని వారి ఆశలు నెరవేరబోవన్నారు.
Telangana: తెలంగాణ ప్రస్తుతానికి మంత్రిమండలిలో ఖాళీలు లేవని తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో అధినాయకత్వంతో మంత్రివర్గ విస్తరణ ముచ్చటే లేదన్నారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై కూడా రేవంత్ తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఏదోలా నాశనం చేయాలని చాలా మంది చూస్తున్నారని ఆరోపించారు.
మూడు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, కేసీఆర్ కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంగా ఎంపీ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఏదో ఒకటి జరిగితే వేడుక చూద్దామని చాలా మంది అనుకుంటున్నారని విమర్శించారు.
పీసీసీ, సీఎం పదవిని సమన్వయం చేయడంలో నేతలతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని అన్నారు రేవంత్. అందుకే ఈ మధ్య కాలంలో కొన్ని అనుకోని ఘటనలు జరిగినట్టు వివరించారు. అలాంటి వాటిలో జీవన్ రెడ్డి ఇష్యూ కూడా ఉందన్నారు.
సమస్య గుర్తించిన వెంటనే జీవన్ రెడ్డికి కీలక నేతలు ఫోన్ చేశారని విషయాన్ని వివరించారని తెలిపారు రేవంత్. జీవన్ రెడ్డి అనుభవాన్ని విధేయతను ఎలా ఉపయోగించుకోవాలో కాంగ్రెస్ అధినాయకత్వానికి బాగా తెలుసని అన్నారు. ఆయన గౌరవానికి ఎక్కడా భంగం కలిగే పరిస్థితి ఉండదని అన్నారు. సీనియర్లు ఎవరికీ అలాంటి భావన అవసరం లేదని సూచించారు.
మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను కూడా రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. దీనిపై ఇంత వరకు అధిష్ఠానంతో చర్చించలేదని చెప్పుకొచ్చారు. అసలు మంత్రివర్గంలో ఖాళీలు లేవని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు అన్ని శాఖలకు సమర్థమంతమైన మంత్రులు ఉన్నారని పేర్కొన్నారు. వాళ‌్లంతా ప్రజల కోసం భాగా పని చేస్తున్నారని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పని చేశానని గుర్తు చేశారు రేవంత్. జులై 7తో తన అధ్యక్షపదవీ కాలం ముగుస్తుందని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వస్తారని వివరించారు. తన హయంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చేలా పార్టీని నడిపించినట్టు అభిప్రాయపడ్డారు.