కుమారి ఆంటీ హోటల్‌పై చేయి వేయొద్దు- పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం
Kumari Aunty Hotel : కుమారి అంటీ హోటల్ అక్కడే కొనసాగించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Revanth Reddy React On Kumari Aunty Hotel Issue: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ హోటల్ రాజకీయంగా కూడా దుమారం రేపింది. కారణం ఏదైనా సరే ఆమె హోటల్‌ను పోలీసులు తీసేయడం వివాదమైంది. రేవంత్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది.
అండగా ఉంటాం: రేవంత్
కుమారి అంటీ హోటల్ అక్కడే కొనసాగించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులకు రక్షణ ఉంటుందని... స్వయం ఉపాధితో బతికే వారికి అండగా ఉంటామన్నారు. కుమారి అంటీ హోటల్ నిర్వహించకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్యరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు పెట్టారు.
Hon’ble CM Sri @Revanth_Anumula garu directed the @TelanganaDGP&MAUD to rescind their decision to shift #KumariAunty a streetside eatery. She will stay in her place. Prajala Palana means the govt stands by entrepreneurs. Congress govt will stand by poor & visit her stall shortly
— ayodhyareddy_boreddy_cprocm (@ayodhyareddyb73) January 31, 2024
ఫుట్ పాత్‌పై భోజనంతో ఫేమస్
పదేళ్లుగా ఫుట్ పాత్‌పై భోజనం అమ్ముకుంటూ కుమారీ అంటీ హోటల్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఫుట్ పాత్ పై ఓ చిన్న పాకలో ఆమె భోజనం వడ్డిస్తున్న తీరు, వచ్చిన వారిని మర్యాదగా సంబోధించే విధానంతో ఆమె చాలా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి.
ఆ ఒక్క మాటతో...
ఆమెకు వచ్చిన పాపులారిటీని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు వాడుకోవడం మొదలైపోయింది. ఓ ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ.. తమకు ఆస్తులు ఏమీ లేవని, ఊళ్లో జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రం ఉందన్నారు. ఇది మరో టర్న్ తీసుకుంది. ఆ క్లిప్‌ను వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా వాడేసుకొని.. ‘‘సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ చెప్తే.. వెటకారం చేసిన పెత్తందారులకి దిమ్మతిరిగిపోయేలా దాసరి సాయి కుమారి చేశారు. ఆమెకు తనకంటూ ఆస్తి ఉందంటే.. అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని ఇంటర్వ్యూలో చెప్పింది’’ అని ఒక పోస్ట్ చేసింది.
అడ్డుకున్న పోలీసులు
ఇంతలో హైదరాబాద్ పోలీసులు మంగళవారం (జనవరి 30) మధ్యాహ్నం సాయి కుమారి వ్యాపారాన్ని అడ్డుకున్నారు. అక్కడ జనాలు ఎక్కువైపోయి.. తమ వాహనాలను రోడ్డుపై ఎక్కడికక్కడ పార్క్ చేస్తుండడం.. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుండడం వల్ల పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. రోజులాగే ఆటోలో ఆహార పదార్థాలను తీసుకు రాగా.. పోలీసులు వాటిని కిందికి దింపనివ్వలేదు. దీంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే తనను ఫేమస్ చేశారని.. అదే తనకు శాపంగా మారిందని వాపోయారు.
వైసీపీ పోస్టుతో వివాదాల్లోకి.
ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ మరో పోస్ట్ కూడా చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయాలతో ముడిపెట్టింది. ‘‘మొత్తానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరికీ సీఎం జగన్ పేరు వింటేనే వణుకు పుడుతోంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారు. జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు’’ అని మరో పోస్ట్ చేసింది.
దీంతో దీనికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఆమె హోటల్‌పై చేయి వేయొద్దని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు మాత్రం తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ మొదలైంది.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కనున్న రోడ్‌లో మధ్యాహ్నం వేళ ఓ పాక వద్ద విపరీతమైన జనం కనిపిస్తారు. ఫుట్ పాత్‌పైన మధ్యాహ్న భోజనం తినడం కోసం కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి ఆఫీసర్ల వరకూ ఆ పాక వద్ద క్యూ కడుతుంటారు. కుమారి ఆంటీగా అందరికీ సుపరిచితమయ్యారు. రెండు లివర్ లు రూ.1000 బిల్ అయిందంటూ.. ఒక క్లిప్ ను విపరీతంగా వైరల్ చేయడంతో.. ట్రోలింగ్ కు గురయ్యారు. ఆ తర్వాత దాని వెనక అసలు ఏం జరిగిందనేదానిపై దాసరి సాయికుమారి క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ ఆమెపై జనాల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రోజురోజుకూ ఆమె వద్ద భోజనం కోసం జనాలు పెరిగిపోవడం ఎక్కువైపోయింది.