TS Assembly: ప్రతిపక్షాల సలహాలు పాటిస్తామని కేసీఆర్ చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది: మంత్రి వేముల
అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల్లో 56 గంటల 25 నిమిషాల పాటు, శాసన మండలి సమావేశాలు 5 రోజుల్లో 17 గంటల పాటు అర్థవంతంగా జరిగాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ, మండలి సమావేశాలు చిన్న అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా జరిగాయని తెలంగాన శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. "అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల్లో 56 గంటల 25 నిమిషాల పాటు, శాసన మండలి సమావేశాలు 5 రోజుల్లో 17 గంటల పాటు అర్థవంతంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై ప్రసంగం తో మొదలైన సమావేశాలు ముఖ్యమంత్రి ద్రవ్యవినిమయ బిల్లు చర్చకు సమాధానమివ్వడంతో ముగిశాయి.
పోడు భూములపై గిరిజన, ఆదివాసీలకు సీఎం కేసీఆర్ ప్రకటన చేసి శుభవార్త అందించారు. వాల్మీకి బోయలను, కాయస్త్ లంబాడీ లను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించుకున్నం. ఐదు బిల్లులను ఆమోదించుకున్నాం. ఈ సమావేశాల్లోనే శాసన మండలి కి డిప్యూటీ చైర్మన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. పద్దులపై సవివరమైన చర్చ జరిగింది. రాత్రి పొద్దు పోయే వరకు చర్చలు జరిగాయి. మంత్రులు తమ శాఖలకు సంబంధించి సభ్యులకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యుల బలం తక్కువగా ఉన్నప్పటికీ మేము ఎక్కడా బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించలేదు.
ప్రతిపక్ష సభ్యులు లేకపోవడం విచారకరం
ప్రభుత్వం తరుఫున మంత్రులు పద్దులపై సమాధానం చెప్పే సమయంలో ప్రతిపక్ష సభ్యులు లేకపోవడం విచారకరం. వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ది, చట్ట సభల పట్ల ఉన్న గౌరవం ప్రజలకు అర్థమయ్యింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలతో పార్లమెంటు సమావేశాలను విజ్ఞులు ఓ సారి బేరీజు వేసుకోవాలి. ఇక్కడ ప్రతిపక్షాలు అడిగిన వాటికి అడగని వాటికి కూడా మేము సమాధానం చెప్పి హుందా గా వ్యవహరిస్తే బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు లో ప్రధాన సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసలు విషయం పై ప్రధాని పార్లమెంట్ లో మొహం చాటేస్తే శాసన సభ లో సీఎం కేసీఆర్ గారు అన్ని అంశాలపై సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో మోడల్ గా మారాం
తన అద్భుత ప్రసంగం తో రాష్ట్ర, దేశ ప్రజలకు గొప్ప సందేశం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తామని చెప్పడం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. సమావేశాలు జరిగిన తీరు రాష్ట్రంలోని ఫీల్ గుడ్ వాతావరణాన్ని ప్రతిబింబించింది. రాష్ట్ర చట్టసభలు జరుగుతున్న తీరు మిగతాసభలకు ఆదర్శంగా మారాయి. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలుస్తున్నట్టే అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో మోడల్ గా మారాం. సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయి అన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రభావo చూపాయన్నది ముఖ్యం. మేము క్వాలిటీకే ప్రాధాన్యత ఇస్తాం క్వాంటిటీ కి కాదు. మేము తెలంగాణను నిలబెడుతుంటే కొందరు ప్రతిపక్ష పార్టీ ల నేతలు పడగొడుతాం పేల్చేస్తాం అంటున్నారు. కేసీఆర్ కష్టపడి తెలంగాణ అస్తిత్వం కాపాడితే.. కొందరు విధ్వంసం కోసం కష్టపడతామంటున్నారు.
అసెంబ్లీ సమావేశాల పై ప్రతిపక్ష పార్టీ లు విమర్శలు చేయాలని విమర్శలు చేస్తున్నాయి వాటిలో పస లేదు. ప్రజలు వారిని పట్టించుకోరు. ఉభయ సభలు సజావుగా జరిగేలా చూసిన స్పీకర్ కి, చైర్మన్ కి, సహకరించిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అసెంబ్లీ సమావేశాల చర్చలు తమ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేర వేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు." అని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.