Telangana Elections 2023: అక్బరుద్దీన్ , తలసాని, దానం ఆరోసారి గెలుస్తారా ? గ్రేటర్ లో పట్టు నిలుపుకుంటారా ?
కొందరు నేతలు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకముద్ర వేసుకున్నారు. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా వారిని విజయాలే వరిస్తున్నాయి.
రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టాలని రాజకీయ నేతలందరికీ ఉంటుంది. అసెంబ్లీలో అధ్యక్షా అని పిలవాలని, తమ గొంతు వినిపించాలని భావిస్తారు. కొందరు నేతలు ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకముద్ర వేసుకున్నారు. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా వారిని విజయాలే వరిస్తున్నాయి. ప్రతికూల రాజకీయ పరిస్థితులకు ఎదురొడ్డి ప్రజల నాడిని పట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురులేదని నిరూపించుకుంటున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, అక్బరుద్దన్ ఓవైసీ గ్రేటర్ రాజకీయాల్లో వీరంతా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
సనత్ నగర్ లో తలసాని హ్యాట్రిక్ కొడతారా ?
తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఐదుసార్లు గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోసారి గెలుపు కోసం బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలెట్టారు. ఐదుసార్లు శాసనసభకు వేర్వేరు పార్టీల తరుపున ఎన్నికయ్యారు. 1986లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్, 1994లో సికింద్రాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో రెండోసారి గెలుపొంది చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2004లో ఓడిపోయినా... 2008 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. మళ్లీ 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్‌కు మారారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కేబినెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. సనత్ నగర్ నుంచి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంలో ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సతీమణి కోట నీలిమ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె జర్నలిస్టుగా పని చేశారు. కోట నీలిమ సీనియర్ నేత తలసానిని ఢీ కొట్టబోతున్నారు.
దానం ఆరోసారి గెలుస్తారా ?
మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు హైదరాబాద్ రాజకీయాల్లో అందరికి సుపరిచితమే. ఆరోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌లో చేరారు. ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆయన ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి 1994, 1999, 2004లో శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2009, 2018లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో ఖైరతాబాద్‌లో, అంతకుముందు ఆసిఫ్‌నగర్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. మరోసారి విజయం కోసం గట్టిగానే తలపడుతున్నారు. 2004 టికెట్ దక్కకపోవడంతో టీడీపీ తరపున పోటీ చేసిన దానం విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంలో కాంగ్రెస్ లో చేరారు. 2009 ఎన్నికల్లో గెలుపొంది వైఎస్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.
చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ డబుల్ హ్యాట్రిక్ కొడతారా ?
చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ 1999 నుంచి వరసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి గెలిస్తే అరుదైన డబుల్ హ్యాట్రిక్ రికార్డు ఆయన పేరున ఉంటుంది. నగరంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరుఫున ఇన్ని పర్యాయాలు ఇప్పటి వరకు ఎవరూ వరుసగా గెలవలేదు.