Telangana Election 2023: టికెట్ దక్కలేదని కాంగ్రెస్‌కు గొట్టిముక్కల రాజీనామా, బాధతో కంటతడి
Gottimukula Vengal Rao: తాజాగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Telangana Assembly Election 2023:
కూకట్‌పల్లి: టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీలు మారుతున్నారు. టికెట్ రాదని ముందే గ్రహించిన నేతలు సైతం కొన్ని రోజుల నుంచి వేరే పార్టీకి జంప్ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ప్రతిసారి చివరి నిమిషంలో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని గొట్టిముక్కల భావించారు. కూకట్ పల్లి సీటు వస్తుందని భావించగా ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో శుక్రవారం రెండో జాబితాను విడుదల చేసింది. కూకట్ పల్లి సీటును శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించడంతో మనస్తాపానికి గురైన గొట్టిముక్కల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
‘యువకుడిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి నాయకత్వంలో దశాబ్దాలపాటు పని చేశాను. కార్యకర్తగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాను. కూకట్ పల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను. 1990లో కూకట్ పల్లి సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికై ఆ తరువాత సింగిల్ విండో చైర్మన్ అయ్యాను. 1998లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం. 2009లో కార్పొరేటర్ గా.. ఇలా పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నానని’ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో గొట్టిముక్కల వెంగళరావు పేర్కొన్నారు.
పార్టీకి విధేయుడిగా సేవలు...
‘గత 17 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇందిరాగాంధీ జయంతి రోజు సుమారు 700 మందికి దుస్తులు ఉచితంగా అందిస్తున్నాను. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీతో పాటు మంచినీటి కనెక్షన్లు కోసం కృషిచేశాను. పీజేఆర్ సహకారంతో బస్తీలలో నివసించే వారికి ఇళ్లపట్టాలకు సహకారం అందించాను. మహిళలకు కుట్టు మిషన్, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్ మంజూరు చేయించాను. పలు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేశాను. టీడీపీ హయాంలో పీజేఆర్ నాయకత్వంలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నాను, అరెస్ట్ అయ్యాను. గులాం నబీ ఆజాద్ మా ఇంటికి వచ్చి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కోరగా అందుకు కృషిచేశాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నియోకవర్గ వ్యాప్తంగా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశాను. 2018 ఎన్నికల్లో కూటమిలో భాగంగా టీడీపీకి సీటు కేటాయించినా, పార్టీ కోసం విధేయుడిగా ఉన్నాను. 2019 లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపు కోసం కూకట్ పల్లి వ్యాప్తంగా పార్టీ నేతలను సమన్వయం చేశాను. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంఛార్జీగా ఇస్తే ప్రతిచోట నేతలను సమన్వయం చేస్తూ పార్టీకి విధేయుడిగా సేవలు అందించాను. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు పూర్తి స్థాయిలో అంబులెన్స్ సౌకర్యం, వైద్య సహాయాన్ని నా కుమారుడు గొట్టిముక్కల విశ్వతేజరావు అందించాడని’ పార్టీకి రాజీనామా లేఖలో గొట్టిముక్కల ప్రస్తావించారు.