Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!
ఉద్యోగం వస్తుందని తాము గత ఎనిమిది ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని, కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఉద్యమ కళాకారులు కన్నీరు పెట్టుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తమ గళానికి పదును పెట్టి, కాళ్లకు గజ్జ కట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవశ్యకతను చాటిన కళాకారులు నిరసనల బాట పట్టారు. అప్పట్లో చురుగ్గా పని చేసిన తమను ఇప్పుడు ప్రభుత్వం తమను విస్మరించిందని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ట్యాంక్ బండ్ పై ఉన్న 125 అడుగుల ఎతైన అంబేడ్కర్ విగ్రహం ముందు పాటలు పాడి, భిక్షాటన చేశారు. ఉద్యమంలో పాల్గొన్న నిజమైన కళాకారులకు కాకుండా తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ తమ అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన తమ గురించి పట్టించుకోలేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం వస్తుందని తాము గత ఎనిమిది ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని, కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఉద్యమ కళాకారులు కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని మిగిలిన 350 మంది ఉన్న కళాకారులకు ఉద్యోగాలు కేటాయించాలని వారు వేడుకున్నారు. లేకపోతే ఏ పాటతో అయితే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామో, అదే పాటతో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పాటలు పాడతామని హెచ్చరించారు. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వారు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.