Telangana Formula E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం- సీఎస్ చేతికి నివేదిక- గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్‌షీట్
Telangana Formula E Race Case: తెలంగాణ ఫార్ములా ఈ-రేసు కేసులో ఛార్జ్‌షీట్ వేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. గవర్నర్ అనుమతి కోసం నివేదికను సీఎస్‌కు అందజేసింది.

Telangana Formula E Race Case: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇన్ని రోజులు విచారణ దశలోనే ఉన్న ఫార్ములా ఈ-రేసు కేసులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో వివిధ సంస్థలు, వ్యక్తులు, అధికారులను ప్రశ్నించిన తెలంగాణ ఏసీబీ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు మరో ముందడుగు వేసేందుకు గవర్నర్ అనుమతి కోసం నివేదికను పంపనుంది.
దాదాపు 9 నెలలుగా విచారణ దశలోనే ఉన్న ఫార్ములా ఈ-రేసు కేసు ఛార్జిషీట్ దిశగా వెళ్తోంది. సీఎస్ రామకృష్ణారావు వద్ద ఉన్న నివేదిక గవర్నర్ అనుమతి కోసం పంపించనున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఇందులో ఉన్నా వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారు. ఇందులో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది. ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ 3గా అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎనరెడ్డిపై కేసు నమోదు అయ్యి ఉంది. వారిపై ఛార్జిషీట్ దాఖలు చేస్తారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ - రేసు లో అక్రమాలు జరిగాయని 2024 డిసెంబర్ 18న కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ సాగుతోంది. కేసు విచారణలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు పిలిచి విచారించారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను కూడా మూడుసార్లు పిలిచి ప్రశ్నించింది ఏసీబీ.
నేను మళ్ళీ మళ్లీ చెప్తున్నా, ఫార్ములా-ఈ కేసు ఒక లొట్టపీసు కేసు: కేటీఆర్
ఫార్ములా ఈ రేసు కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు ఏసీబీ సిద్ధమైందన్న అంశంపై కేటీఆర్ స్పందించారు. "నేను మళ్ళీ చెప్తున్నా, ఫార్ములా-ఈ రేసు కేసు ఒక లొట్టపీసు కేసు," అని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని ఆయన సవాలు విసిరారు. హైదరాబాద్‌కి ఫార్ములా-ఈ రేసు తీసుకురావడానికి తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు. ఈ రేసు కోసం ప్రభుత్వం నుంచి రూ. 46 కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, ఆ డబ్బులు నేరుగా నిర్దేశిత ఖాతాలోకి చేరాయని తెలిపారు. ఇందులో రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉందని, అలాంటప్పుడు అవినీతి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ చేసినా, ఛార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరని అన్నారు.
కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై పోరాడుతామని పునరుద్ఘాటించారు. "సీఎం, నేను ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్షను టీవీ ఛానల్ ముందు ఎదుర్కొందాం," అని సవాలు విసిరారు. గతంలో రూ. 50 లక్షల నోట్ల కట్టలతో కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. ఈ పరీక్షతో ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఫార్ములా-ఈ కేసును ముందుకు తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. కానీ తాము మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.





















