Telangana: ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76.3 శాతం ప్రసవాలు, ప్రశంసించిన మంత్రి హరీశ్‌రావు
Telangana: ఆగస్టు నెలలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 76.3 శాతం ప్రసవాలు జరిగాయి.
Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నాయి. ముఖ్యంగా ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా మంది సాధారణ ప్రసవమే చేయించుకోవాలని కోరుకోవడం వల్ల.. ప్రైవేటుకు వెళ్తే సిజేరియన్ చేస్తారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే సాధారణం ప్రసవం చేస్తారని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సాధారణ ప్రసవాలకే ఎక్కువ మొగ్గు చూపుతుండటం మూలంగా.. సర్కారు దవాఖానాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదు అయ్యాయి. ఇదో గొప్ప విషయమని, చరిత్రలో సరికొత్త రికార్డు అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. 2014లో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు కేవలం 30 శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు 76.3 శాతానికి పెరగడం పట్ల హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం(సెప్టెంబర్ 5) నాడు రాష్ట్రంలోని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి హరీశ్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014 లో 30 శాతంగా ఉన్న డెలివరీలను.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో, వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషితో 9 ఏళ్లలో 76.3 శాతానికి పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని మంత్రి అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్యశాఖ సిబ్బందిని హరీశ్ రావు అభినందించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక ప్రసవాలతో నారాయణపేట, ములుగు, మెదక్ జిల్లాలో టాప్ లో నిలవగా.. ఆయా జిల్లాల సిబ్బందిని హరీశ్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. మంచిర్యాల(63), నిర్మల్(66), మేడ్చల్, కరీంనగర్(67) జిల్లాల్లో అతి తక్కువ డెలివరీలు నమోదు కావడంతో.. ఆయా జిల్లాల్లో వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపడాలని సూచించారు.
ఓవరాల్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ లో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు కనబరిచినట్లు మంత్రి హరీశ్ రావు అభినందించారు. టాప్-5 లో నిలిచిన జిల్లాల సిబ్బందిని ప్రశంసించారు. జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నారాయణపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు చివరి స్థానంలో నిలవగా.. ఆయా జిల్లాల వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రాథమిక స్థాయి వైద్యం అందిస్తూ, ప్రజలను రోగాల బారి నుంచి కాపాడటంలో పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రజలకు అందేలా చూడాలని చెప్పారు.
అత్యధిక ప్రసవాల్లో టాప్-5 జిల్లాలు
- నారాయణపేట 89.1%
- ములుగు 87.5%
- మెదక్ 86%
- జోగులాంబ గద్వాల 85.1%
- భద్రాద్రి కొత్తగూడెం 84.7%
ఓవరాల్ ర్యాంకింగ్‌లో టాప్-5 జిల్లాలు
- మెదక్ 84.4%
- జోగులాంబ గద్వాల 83.9%
- వికారాబాద్ 81%
- ములుగు 79%
- నాగర్ కర్నూల్ 77%
వర్షాలు కురుస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి: హరీశ్
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వేళ ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ండాలనని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ తేదీ తెలుసుకుని ముందస్తుగా దవాఖానాలకు తరలించాలని సూచించారు.