హెచ్‌సీఏ వివాదాల పరిష్కారానికి సుప్రీం కోర్టు తొలి అడుగు- జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నియామకం
హెచ్‌సీఏ రోజువారి కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించింది సుప్రీంకోర్టు.
ఆటతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను దారికి తెచ్చేందుకు సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో కార్యక్రమాలు, ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎప్పటి నుంచో పాతుకుపోయిన అజారుద్దీన్ బ్యాచ్‌కు కోర్టు ఝలక్ ఇచ్చింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. అధ్యక్ష పదవీ కాలం ముగిసినప్పటికీ హెచ్‌సీఏను మాత్రం అజారుద్దీన్ వదల్లేదు. దీంతో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీని నేతృత్వంలో హెచ్‌సీఏ కార్యక్రమాలు, ఇతర అంశాలు పర్యవేక్షిస్తూ వచ్చారు. అయినా వివాదాలు ఏమాత్రం సద్దుమణగలేదు.
గతంలో జస్టిస్ దీపక్‌వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమించడంపై హెస్‌సీఏ పరిధిలోని కొన్ని క్రికెట్ క్లబ్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. దాన్ని హైకోర్టు కొట్టివేయడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో మరికొంతమంది ఈ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యారు. వాటన్నింటిని సుప్రీంకోర్టు విచారించింది.
హెచ్‌సీఏ రోజువారి కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ అరవింద్‌కుమాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలు ఇచ్చే సందర్భంగా సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. హెచ్‌సీఏలో ఉన్న వివాదాలకు పూర్తిగా తెరపడాలని ఆకాంక్షించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని దీనికి జస్టిస్ నాగేశ్వరరావుకు పూర్తిగా సహకరించాలని సూచిచించింది. అనంతరం కేసును మార్చి 2కు వాయిదా వేసింది ధర్మాసనం.
జస్టిస్ లావు నాగేశ్వరరావు నియామకాన్ని ఫిర్యాదుదారులతోపాటు హెచ్‌సీఏ అంగీకరించడంతో ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించింది సుప్రీంకోర్టు. హెచ్‌సీఏలో వివాదాలు ఇప్పటివి కాదు. కొన్నేళ్ల నుంచి సాగుతున్న అంతర్గత యుద్ధం. దీనిపై ఎన్ని కమిటీలు వేసినా ఎంతమంది అధ్యక్షులు మారుతున్నా దారిలో పడటం లేదు.