Sutanu Guru: ‘అదే ప్రధాని నరేంద్ర మోదీ బలం’ - ప్రజల్లో చైతన్యం వచ్చిందన్న సీనియర్ పాత్రికేయుడు సుతను గురు
Hyderabad News: దేశంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలు మళ్ళీ మోదీ వైపే మొగ్గు చూపడం పూర్తిగా ప్రతిపక్షాల వైఫల్యమేనని సీనియర్ జర్నలిస్టు, సీఓటర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుతను గురు అన్నారు.
Senoir Journalist Sutanu Guru Interactive Session: దేశ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రస్తుతం ప్రతిపక్షం విఫలమైందని సీనియర్ పాత్రికేయులు, సీఓటర్ Cvoter రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుతను గురు (Sutanu Guru) అన్నారు. ‘ఇండియా టు భారత్’ పేరిట 90 రోజుల దేశయాత్ర చేస్తున్న గురు, తన ప్రయాణంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా నియో సైన్స్ హబ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ మాసపత్రిక, స్మార్ట్ ల్యాబ్ టెక్ ఏర్పాటు చేసిన ప్రెస్ ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్నారు.
‘అదే కారణం!’
‘దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గాయి. ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేదు. కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. అయితే, సగటు ఓటరు మాత్రం మళ్లీ నరేంద్ర మోదీవైపే మొగ్గు చూపొచ్చు. దీనికి కారణం ప్రజలకు ప్రతిపక్షాల మీద ఏ మాత్రం నమ్మకం లేకపోవడమే కారణం.’ అని సుతను గురు అభిప్రాయపడ్డారు. తాను చేస్తున్న ‘ఇండియా టు భారత్’ యాత్ర.. రాజకీయాలకు అతీతం కాదు గానీ, రాజకీయ నాయకులకు మాత్రం ఎంతో దూరమని ఆయన ఓ ప్రశ్నకి బదులిచ్చారు. 90 రోజుల యాత్రలో 60 రోజులు పూర్తైందని.. మరో 30 రోజులు ఈ యాత్ర సాగనుందని వివరించారు. ఈ ప్రయాణంలో ఏ ఒక్క రాజకీయ నాయకున్ని కూడా తాను కలవలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని సామాన్యుడి ఆలోచనలు తెలుసుకొని, అభిప్రాయాలు పంచుకొని, ఆకాంక్షల్ని అర్థం చేసుకోవడమే తన యాత్ర అంతరార్థమని చెప్పారు.
‘ప్రజల్లో చైతన్యం వచ్చింది’
దేశంలోని ఏ పార్టీ అవినీతికి అతీతం కాదనే స్పష్టత ప్రజలందరికీ ఉందని.. అసలు అవినీతి అనేది ఎన్నికల్లో అంశమే కావడం లేదని సుతను గురు అభిప్రాయపడ్డారు. స్థానిక అవసరాలు, తమ సమస్యలు తీర్చే నాయకులకే ఓట్లు వేసుకునే చైతన్యం ప్రజల్లో వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలు ఉత్తరాదికి కొత్త గానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయని కాబట్టి మోదీ సంక్షేమ పథకాల మంత్రం దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయడం లేదని అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటర్లు కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని.. అయితే, హిందువులమని ప్రకటించుకోవడానికి, తమ ఉనికిని గుర్తించబడటానికీ హిందువులు గతంలోలా సంకోచించకపోవడం బీజేపీకి కొంత ఊరట కలిగించే అంశమని సుతను విశ్లేషించారు.
ఎన్ఎస్ హెచ్ మీడియా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తన అనుభవాలు పంచుకోవడానికి అంగీకరించిన సుతనుకి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ వెంకట సత్యప్రసాద్ పోతరాజు కృతజ్ఞతలు తెలిపారు. నవతరానికి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని కలిగించి, వారిలో శాస్త్రీయ భావాలని పెంపొందించాలనే ఆదర్శంతోనే నియో సైన్స్ హబ్ మీడియాను స్థాపించి, ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ముందుకు పోతున్నామని ఆయన వివరించారు. ఈ సమావేశానికి సీనియర్ పాత్రికేయుడు, రచయిత, రాకా సుధాకర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎన్ఎస్ హెచ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుబ్రమణియన్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం సాగింది.