CM Revanth Reddy: సెక్రటేరియట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
సెక్రటేరియట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాల్లో మొదలయ్యాయి. క్రిస్మస్ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
Christmas Celebrations at LB Stadium : సెక్రటేరియట్ (Secratariat)తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ముఖ్యమంత్రి (Chief Minister)రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా సచివాలయానికి వచ్చి స్వేచ్ఛగా చెప్పవచ్చని తెలిపారు. ఎల్బీ స్టేడియం (Lb Stadium)లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రిస్టియన్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏసుక్రీస్తు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతామన్నారు.
మత విశ్వాసాలకు స్వేచ్ఛ కల్పించిన ఘనత కాంగ్రెస్ దే
దేశంలో, రాష్ట్రంలో మత విశ్వాసాలకు స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. అభివృద్ధి, అర్హులకు మంచి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. క్రైస్తవులు, మైనారిటీలు ఏ మారుమూలలో ఉన్నా సంక్షేమ పథకాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న సీఎం, ఏ సమస్య వచ్చినా సెక్రటేరియట్ కు వచ్చి స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. పోలీసు పహారాలో ఉన్న ప్రభుత్వ ముళ్ల కంచెలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బద్దలుకొట్టిందని గుర్తు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా తమ వాణిని వినిపించే అవకాశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరాలి
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే దేశానికి రక్షణ ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే దేశంలో సర్వమత మధ్య శాంతియుత వాతావరణం ఉంటుందన్నారు. దేశ ప్రజలపై గురుతర బాధ్యత ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినట్లే, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రాహుల్ గాంధీ మణిపుర్ వెళ్లి జాతుల మధ్య వైషమ్యాలు తగ్గించే ప్రయత్నం చేశారన్న ఆయన, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మణిపుర్ ప్రజలను కాపాడే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. మణిపుర్‌లో కిరాతక చర్యలు చూస్తుంటే... దేశ భవిష్యత్, రక్షణపై అనుమానాలకు తావిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మణిపుర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ప్రజల ప్రాణ, మానాలకు రక్షణ కల్పించలేకపోయాయన్న ఆయన, బీజేపీ నేతలకు ప్రజల ప్రాణాలకన్నా ఎన్నికలే ముఖ్యమని మండిపడ్డారు.