Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గాలకు డీపీఆర్ రెడీ చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి
secong phase of Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి గారు మంగళవారం సమీక్షజరిపారు.
Revanth Reddy review over secong phase of Hyderabad Metro Train:
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు (Hyderabad Metro Train) నిర్మాణం జరగాలని, ఈ విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి గారు మంగళవారం సమీక్షజరిపారు. సమీక్షలో భాగంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారు రెండో దశ ప్రతిపాదనలపై సమగ్రంగా ప్రజంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించారు. దీనికోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలని మెట్రోరైలు ఎండీనీ ఆదేశించారు.
దారుల్ పిషా నుండి ఫలక్ నుమా జంక్షన్ వరకు రహదారి విస్తరణ
దారుల్ షిఫా జంక్షన్ నుండి షాలిబండ వరకు గల మెట్రోరైల్ స్ట్రెచ్ మార్గాన్ని రోడ్డును వెడల్పు చేయాలన్న హెచ్ఎంఆర్ఎల్ చేసిన ప్రతిపాదనలపై పాతస్తీ ప్రజా ప్రతినిధులతో సంప్రదించాలన్నారు. దారుల్ పిషా జంక్షన్ నుండి ఫలక్ నుమా జంక్షన్ వరకు రహాదారిని 100 ఫీట్ల వరకు విస్తరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనివల్ల పాతనగరం ఇతర ప్రాంతాలతో సమానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని అన్నారు.
మెట్రోరైలు నిర్మాణ ప్రణాళికలో భాగంగా పాతనగరంలో వారసత్వ, మతపరమైన నిర్మాణాలు 103 ఉన్నాయని తేలిందని వీటికి నష్టం జరుగకుండా చూడాలని ఆకాంక్షించారు. ఈ ప్రక్రియలో అవసరమైతే తానే స్వయంగా కలుగజేసుకుంటానని, ఓల్డ్ సిటీ ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటామని అన్నారు.
రాయదుర్గం - శంషాబాద్ ఏయిర్ పోర్టు మెట్రో నిలిపివేత
గత ప్రభుత్వం రాయదుర్గం నుండి శంషాబాద్ ఏయిర్ పోర్టు వరకు రూ.6,250 కోట్లతో నిర్మించతలపెట్టిన 31 కిలోమీటర్ల ఏయిర్ పోర్టు మెట్రో ప్లాన్ ను ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా వెడల్పైన అవుటర్ రింగ్ రోడ్డు ఉందని అన్నారు. దీనికి బదులుగా ఏయిర్ పోర్టుకు మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని అన్నారు. అదేవిధంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు గల 5 కిలోమీటర్ల మేర దూరాన్ని కూడా కలుపుతూ ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.
ఏయిర్ పోర్టు మెట్రోకు సంబంధించి మార్చిన అలైన్ మెంట్ ప్రకారం వయా ఓల్డ్ సిటీ , ఎల్బీనగర్ కు సంబంధించిన ట్రాఫిక్ అధ్యయనం చేయడంతోపాటు డీపీఆర్ త్వరగా సిద్ధం చేయాలని హెచ్ ఎంఆర్ ఎల్ ఎండీకి సీఎం గారు సూచించారు. లక్ష్మిగూడ-జల్ పల్లి –మామిడిపల్లి మార్గంలో కొత్తగా మెట్రో నిర్మాణం కోసం అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు మధ్యలో 40 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేసే ప్రణాళికను పరిశీలించాలని సూచించారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని తెలిపారు. ఇదే మార్గంలో ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్ మెంట్ కోసం స్ట్రెచ్ వెంట అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని హెచ్ ఎండీఏ కమిషనర్ ఎం. దానకిషోర్ తో పాటు సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రిని సీఎం గారు ఆదేశించారు. అలాగే ఓల్డ్ సిటీతోపాటు దాని చుట్టుపక్కల అభివృద్ధి చేయాలని సీఎం గారు ఆదేశించారు. కొత్త అలైన్ మెంట్ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా, నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలని సీఎంగారు ఆదేశించారు.
అదేవిధంగా ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మెట్రోరైలు ఎండీని ఆదేశించారు. విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కింది విధంగా ఉన్నాయి.
1 . మియాపూర్-చందానగర్-బీహెచ్ఈఎల్-పటాన్ చెరు(14 కిలోమీటర్లు)
2. ఎంజీబీఎస్-ఫలక్ నుమా-చాంద్రాయణగుట్ట-మైలాదేవర్ పల్లి-పీ7 రోడ్డు-ఏయిర్ పోర్టు(23 కిలోమీటర్లు)
3. నాగోల్-ఎల్బీనగర్—ఓవైసీ హాస్పటల్-చాంద్రాయణ గుట్ల-మైలాదేవర్ పల్లి-ఆరాంఘర్-న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్(19 కిలోమీటర్లు)
4. కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుండి/అమెరికన్ కాన్సూలేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్ బీ రోడ్డు(12 కిలోమీటర్లు)
5. ఎల్బీనగర్-వనస్థలిపురం-హయత్ నగర్(8 కిలోమీటర్లు)
పై వాటికి సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి సెంట్రల్ అర్బన్ డెవలప్ మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ హర్దిప్ సింగ్ పూరికి డ్రాఫ్టు లెటర్ ను సిద్ధం చేసి పంపించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రోరైలు ఎండీని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 40 కిలోమేటర్ల మేర మూసి రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్ ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుండి నార్సంగి వయా నాగోల్ , వయా ఎంజీబీఎస్ చేపట్టాలని కోరారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలకు తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని , ఓఆర్ఆర్ చుట్టు చిన్నాభిన్నమైన ప్రాంతాలను గ్రోత్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఏయిర్ పోర్టు ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రోరైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలని సూచించారు. ఇక్కడ ఫార్మాసిటీ కోసం భూములను ఈ ప్రాంతంలో సేకరించడం జరిగిందని అన్నారు. అందువల్లే మెట్రో కనెక్టివిటి అవసరమని అన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామిర్ పేట్ వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడవ దశ విస్తరణ జరుగాలని ఆకాంక్షించారు.