Revanth Reddy: దోపిడీ అంటే కేసీఆర్ ఫ్యామిలీ, ప్రాణ త్యాగాలంటే గాంధీ కుటుంబం: రేవంత్
Telangana News | మాజీ మంత్రి గీతారెడ్డికి రాజీవ్ గాంధీ సద్భావనా అవార్డును సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆమెకు అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణను దోపిడీ చేసిన చరిత్రి కేసీఆర్ కుటుంబానిది కాగా, దేశం కోసం తమ ప్రాణాలు సైతం అర్పించిన ఘనత గాంధీ కుటుంబానిది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు సైతం అర్పించారని.. అదే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని రేవంత్ పేర్కొన్నారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గీతారెడ్డికి రాజీవ్ గాంధీ సద్భావనా అవార్డును సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ 34 ఏళ్ల క్రితం సద్భావన యాత్ర చేపట్టారు. ప్రతి ఏడాది అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వస్తున్నాం. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలు అందించిన మాజీ మంత్రి గీతా రెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. రాజకీయాల్లో ఉంటే పదవుల కోసం పాకులాడే వారిని చూశా కానీ గత ఎన్నికల్లో ఏమీ ఆశించకపోగా, పోటీ చేయని గొప్ప వ్యక్తి గీతారెడ్డి’ అని పేర్కొన్నారు.
గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే దేశంలో పేదలకు మేలు జరిగింది. పేదలకు మేలు జరిగేది గాంధీకుటుంబంతో మాత్రమే. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అందరికీ తెలుసు. సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పదవులను త్యాగం చేశారు. గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న వారికి ఏమైనా పోలిక ఉందా?
కబ్జాదారులే భయపడుతున్నారు..
ఆక్రమణలకు పాల్పడ్డ బడా బాబుల పట్ల భూతం హైడ్రా అని రేవంత్ రెడ్డి అన్నారు. నాళాలు, చెరువులను, ప్రభుత్వ భూములను, ఆక్రమించుకుని పెద్ద పెద్ద బిల్డింగులు, ఫాం హౌస్‌లు కట్టిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడిన మదపుటేనుగులను అణచడానికి హైడ్రా అంకుశంలా పనిచేస్తుందన్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ను సైతం దెబ్బ తీయాలని కుట్ర జరగుతోందన్నారు.
బిల్లా రంగాలు అడ్డుపడుతున్నారు
అక్రమ నిర్మాణాలను అడ్డుకుని హైడ్రా వారిపై చర్యలు తీసుకుంటుంటే బిల్లా రంగాలు వచ్చి బుల్డోజర్లకు అడ్డు పడతామంటున్నారు. మూసీ వద్దకు కాదు, జన్వాడ ఫామ్ హౌస్ కు పోదాం. గుల్ఖాపూర్ నాలాను ఆక్రమించుకుని కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టలేదా? అని రేవంత్ ప్రశ్నించారు. ఫామ్ హౌస్ కు బుల్డోజర్ వస్తుందనే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్.. నీలాంటి వాళ్లు కాదు.. ఫామ్ హౌస్ లో పడుకున్న వాళ్లను రమ్మను, నేను కూడా వస్తా.. నీది ఒక స్థాయేనా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
మూసీ పునరుజ్జీవనం వేరు, హైడ్రా వేరు. మూసీలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. ట్రాఫిక్ సమస్య, నాళాల పునరుద్ధరణకు అడ్డుకట్ట వేయడానికే హైడ్రా పనిచేస్తోంది. మీరు చెప్పినట్టు అక్కడికి ఇక్కడికి కాదు, ఫామ్ హౌస్ కు రమ్మని సవాల్ చేశారా? అని ప్రశ్నించారు. వాళ్ల ఫామ్ హౌస్ ల వద్దకు ఎప్పుడు రావాలో అది కూడా హరీష్ రావు చెప్పాలన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ ఫామ్ హౌస్ లకు సంబంధించి అఖిలపక్షం పిలిచి, నిజ నిర్ధారణ కమిటీతో నిజాలు ఏంటో తేల్చేద్దామని పిలుపునిచ్చారు.