Revanth Reddy: రాహుల్‌ని ప్రధాని చెయ్యాలనేది వైఎస్ కోరిక, అలా జరిగితేనే ఆత్మకు శాంతి: రేవంత్ రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పూల మాల వేసి నివాళి అర్పించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు దివంగత వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా కీలక నేతలందరూ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి వైస్సార్ ప్రజల్లో ఎంతో ఆదరణ పొందారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రిఎంబర్స్ మెంట్, జలయజ్ఞం, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు వైస్సార్ అని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే వైఎస్ ఆత్మకు శాంతి కలుగుతుందని వ్యాఖ్యానించారు.
‘‘వైఎస్ఆర్ గొప్ప రాజనీతజ్ఞుడు. వైఎస్ఆర్ కి హైదరాబాద్ లో స్మృతి వనం లేకపోవడం అవమానం. కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇస్తున్నారు మంచిదే. ప్రభుత్వం వైఎస్‌ఆర్ స్మృతి వనం నిర్మించాలి. లేకపోతే 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.. రాగానే వైస్సార్ స్మృతి వనం ఏర్పాటు చేస్తాం. వైఎస్ఆర్ స్ఫూర్తి తో పని చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తాం.’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ 73 జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నాం. వైఎస్ఆర్ లేని లోటు మనందరికీ బాధాకరం. నాయకుడు, పాలకుడు అంటే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే మొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నిరంతరం ప్రజల కోసమే పని చేశారు. సంక్షేమంతో పాటు దేశానికి అభివృద్ధిని చూపిన మహనీయుడు.
వైఎస్ బాటలో ప్రతి కార్యకర్తా నడవాలి - భట్టి
హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందడం, రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి అనేది వైఎస్ఆర్ తీసుకువచ్చిన జలయజ్ఞం వల్లనే సాధ్యం అయింది. నిరుద్యోగ యువతి యువకుల కోసం అనేక ఉద్యోగ కార్యక్రమాలు చేపట్టారు. సమసమాజ స్థాపన కోస వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. దేశంలోనే ఉచిత విద్యుత్ కి ఆద్యుడు వైఎస్. ఆనాడు సబ్సిడీ వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున అందించారు. వైఎస్ఆర్ ఆలోచన, ఆయన చూపిన మార్గదర్శకత్వం ఆచరణీయం, మా అందరికీ ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో ప్రతి కార్యకర్త నడవాలి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి.’’ అని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి గాంధీ భవన్లో నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి విక్రమార్క & ఇతర సీనియర్ నాయకులు. pic.twitter.com/u4lHp78azG
— Telangana Congress (@INCTelangana) July 8, 2022