Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి 48 గంటల డెడ్‌లైన్, స్పందించకుంటే అన్ని కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసుల ముట్టడి
‘కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసోం సీఎం అరెస్ట్‌కు స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలి. న్యాయనిపుణులతోనూ చర్చించాలి. 48 గంటలు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు సమయం ఇస్తున్నాం’ అని రేవంత్ అన్నారు.
రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు వివిధ చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘‘జాతీయ ఎన్నికల ప్రధాన అధికారులు హిమంతబిశ్వ శర్మ అరెస్ట్‌కు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు. ఉత్తరాఖండ్ పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చి, అరెస్ట్ కు ప్రయత్నిస్తారని భావించాం. సీఎం పదవి నుంచి బీజేపీ భర్తరఫ్ చేస్తుందని భావించాం. కానీ నిస్సిగ్గుగా బీజేపీ ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుంది. కొంతమంది ఇది గాంధీ కుటుంబానికి జరిగిన అవమానంగా చెబున్నారు. కానీ, ఈ దేశ మహిళలకు జరిగిన అవమానం ఇది. ఈ దేశ మాతృమూర్తులకు జరిగిన అవమానంపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశాం. మా కంప్లైంట్‌పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వెంటనే అసోం సీఎంకు నోటీసులు ఇవ్వాలి. అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది.
కేసీఆర్ స్పెషల్ టీం ఏర్పాటు చేయాలి.. లేదంటే..: రేవంత్
కేసీఆర్ నిన్న, మొన్న మాట్లాడినట్లు ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అసోం సీఎం అరెస్ట్‌కు స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలి. న్యాయనిపుణులతోనూ చర్చించాలి. 48 గంటలు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు సమయం ఇస్తున్నాం. ఆలోపు స్పందించకుంటే 16న అన్ని కమిషనరేట్‌లతో పాటు ఎస్పీ కార్యాలయాలు ముట్టడిస్తాం. హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడికి నేనే వస్తా’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Lodged a complaint on @himantabiswa at Jubilee Hills police station for his defamatory comments on @RahulGandhi
— Revanth Reddy (@revanth_anumula) February 14, 2022
It’s an insult to motherhood of every woman.
Modi,Shah & Nadda should respond to their Assam CM’s derogatory comments on women & sack him immediately.#HataoAssamCM pic.twitter.com/hdBLIdLtHq
ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్‌లో భట్టి ఫిర్యాదు
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేయాలని సీల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటి నాయకులతో కలిసి ఆయన ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కొంపల్లి కౌన్సిలర్ జ్యోత్స్న శివారెడ్డి ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ పీఎస్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.