Rahul Gandhi: విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే యాత్ర లక్ష్యం: రాహుల్ గాంధీ
Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ.. బీజేపీ, టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ముత్తంగి హరిదాస్ పాయింట్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.
Rahul Gandhi: ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారని.. 25 కిలోమీటర్లు నడిచినా ఎవరికీ అలసట రావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు అలసట అనేది లేకుండా చేస్తున్నాయని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని వెల్లడించారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టిస్తోందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ప్రజల్ని భయాందోళనకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. "భారత్ డైనమిక్స్ దేశ రక్షణ కోసం క్షిపణులను తయారు చేస్తోంది. ఈ క్షిపణులు దేశ రక్షణ కోసం పనిచేస్తున్నాయి. BHEL, BDL సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఉద్యోగులను భయపెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలు భారత దేశ మూలధనం. బీజేపీ ప్రజల ఆస్తులను తమ వ్యాపార మిత్రులకు కట్టబెట్టాలని చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరి సొత్తు కాదు. ఇది దేశ ప్రజల సొత్తు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనీయం. ఇందుకోసం ఉద్యోగులు, ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది. దేశంలో, రాష్ట్రంలో యువకులకు చదువుకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. ఇంజనీరింగ్ చదివిన వారు కూలీలుగా పని చేస్తున్నారు. నరేంద్ర మోదీ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లేకుండా చేశారు. నల్లధనాన్ని వెనక్కు తెస్తానన్న మోదీ.. నోట్ల రద్దు చేశారు. జీఎస్టీ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రోడ్డున పడేశారు. అక్కడ మోదీ చేసిందే ఇక్కడ కేసీఆర్ చేస్తున్నారు" అంటూ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై, మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో భూములు ఏమయ్యాయి?
ధరణి పోర్టల్ లో మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. "బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి. దిల్లీలో మోదీకి కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ కు మోదీ సహకారం ఇచ్చుకుంటున్నారు. ప్రజల్లో భయాన్ని పారద్రోలేందుకే భారత్ జోడో యాత్ర. ప్రభుత్వ సొమ్మును మోదీ తమ మిత్రులకు కట్టబెడుతున్నారు. ఆ సొమ్మును రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఉపయోగిస్తున్నారు. కేసీఆర్ కమీషన్ల సొమ్మును తన కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల సొమ్మును కాపాడేందుకే జోడో యాత్ర" అని రాహుల్ గాంధీ తెలంగాణ సర్కారుపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ లో ఉత్సాహంగా సాగింది. బుధవారం ఉదయం గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభం అయింది. న్యూ బోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, సుమిత్రా నగర్ ఐడీపీఎల్ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది. అక్కడి నుంచి పగటి వేళ విరామం తీసుకున్న తర్వాత తిరిగి జోడో పాదయాత్ర ప్రారంభం అయింది. మియాపూర్ లోని ఇందిరానగర్ కాలనీ, రామచంద్రాపురం, పటాన్ చెరు, శాంతి నగర్ మీదుగా ముత్తంగి వరకు సాగింది. ముత్తంగి హరిదాస్ పాయింట్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.