Petrol Shortage News: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా? గుడ్‌న్యూస్ చెప్పిన బంక్ డీలర్స్ ప్రెసిడెంట్
Telangana News: తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఇంధన షార్టేజ్ లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా జనవరి 1 ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేశారని చెప్పారు.
Shortage of Petrol Diesel: తెలంగాణలో ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందనే వదంతులు ఊపందుకోవడంతో దీనిపై పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఇంధన షార్టేజ్ లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిన్న (జనవరి 1) ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేశారని చెప్పారు. ఈరోజు వారితో మాట్లాడి సమ్మె విరమించామని వివరించారు.
ఇంకా తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అప్పటికే కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈరోజు రాత్రి వరకు అన్ని బంకులకు స్టాక్ వస్తుంది. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజూ రెండు డిపోల నుండి 40 లక్షల లీటర్ల డీజిల్, పెట్రోల్ సప్లై అవుతుంది. పెట్రోల్ బంకులు బంద్ అవుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అందువల్లే ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. మరో మూడు గంటల్లో యథావిధిగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది’’ అని తెలిపారు.