Pravallika Suicide Case: ప్రవళిక సూసైడ్ కేసులో నిందితుడి శివరాం పేరు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Pravallika Suicide Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆమె స్నేహితుడు శివరాంను పోలీసులు నిందితుడిగా చేర్చారు. శివరాం నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.
Pravallika Suicide Case: గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆమె స్నేహితుడు శివరాంను పోలీసులు నిందితుడిగా చేర్చారు. పెళ్లి చేసుకుంటానని శివరాం నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.
ప్రవళిక తల్లి ఏం చెప్పారంటే?
ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లి విజయ స్పందించారు. శివరాం అనే యువకుడి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు వాపోయారు. 'నా కుమారుడు, కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ చదువుకుంటున్నారు. కాయ కష్టం చేసి కష్టపడి కోచింగ్ ఇప్పించాం. అయితే, ప్రవళికను శివరాం ప్రేమ పేరుతో వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిందితున్ని కఠినంగా శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వారికి రాకూడదు. బిడ్డ పోయిన బాధలో ఉన్నాం. రాజకీయాలుంటే మీరు మీరూ చూసుకోండి. అంతే తప్ప మా కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు.' అంటూ ఆమె వాపోయారు.
‘న్యాయం చేయాలి’
తన అక్క ప్రవళిక చావుకు శివరామే కారణమని ఆమె సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. అతన్ని కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు తమను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. 'అక్క హాస్టల్‌కు కొంచెం దూరంలోనే ఉంటాను. వారానికి 3, 4 సార్లు కలిసి మాట్లాడుకుంటాం. శివరాం అనే వ్యక్తే మా అక్క చావుకు కారణం. వేరే అమ్మాయి ద్వారా శివరాం పరిచయమయ్యాడు. అతని వేధింపులతో అక్క మానసిక వేదనకు గురైంది. డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.' అని కుమార్ తెలిపాడు.
ఏం జరిగిందంటే.?
వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవలిక (23) హైదరాబాద్ అశోక్ నగర్ హాస్టల్‌లో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 13న ఆమె తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, గ్రూప్ - 2 పరీక్ష వాయిదా పడడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, సర్కారుపై విమర్శలు చేశారు.
పోలీసులు ఏం చెప్పారంటే.?
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రకటించారు. ఫోన్, వాట్సాప్, స్నేహితులను విచారించిన అనంతరం ప్రవళిక ప్రియుడు ఆమెను కాదని మరో యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ యాదగిరి తెలిపారు.
రాజకీయంగానూ దుమారం
ఓ వైపు నిరుద్యోగుల ఆందోళన, మరో వైపు పోలీసుల ప్రకటనతో రాజకీయంగానూ ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది. పోలీసులు దీనిపై స్పష్టమైన ప్రకటనే చేశారని చెప్పిన మంత్రి కేటీఆర్, అది నిజం కాదని విపక్షాలు నిరూపించగలరా.? అంటూ ప్రశ్నించారు. అసలు ప్రవళిక గ్రూప్స్ పరీక్షలకే దరఖాస్తు చేయలేదని కేటీఆర్ చెప్పగా, ఆమె పరీక్ష రాసిందంటూ సంబంధిత పత్రాలను కొందరు నిరుద్యోగులు నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.