MLC Kavitha On PM Modi: 9 ఏళ్లలో ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించని నేత ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha On PM Modi: జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ప్రధాని మోదీ 9 ఏళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదన్నారు.
- టీయూడబ్ల్యూజే, ఐజేయూ ప్లీనరీలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- 9 ఏళ్లలో మీడియా సమావేశం నిర్వహించని ప్రధాని మోదీ
- జరల్నిస్టులతో సమావేశం నిర్వహించి, సమాధానాలు చెప్పే నేత కేసీఆర్
- తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు
MLC Kavitha Comments: తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు సీఎం కేసీఆర్ తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పటాన్ చెరులోని GMR కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ద్వితీయ మహాసభలు & ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ( ఐజేయూ) 10 వ ప్లీనరీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మీడియా సంస్థల విశ్వసనీయతతో పాటు, ప్రసారం చేస్తున్న వ్యక్తులకు సైతం నిబద్దత ఉన్నప్పుడే, ప్రసారం చేసే వార్తల పట్ల విశ్వాసం కలుగుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవడం బాధాకరమన్నారు కవిత.
కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ బద్నాం చేసే ప్రయత్నాలు
కొన్ని సంస్థలు కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇలాంటి కుట్రల పట్ల జర్నలిస్టులు సైతం ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గత తొమ్మిదేండ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదన్న ఎమ్మెల్సీ కవిత, దీనిపై ఒక్క జర్నలిస్టు యూనియన్ కూడా ప్రశ్నించలేదన్నారు. సీఎం కేసీఆర్ వందలాది మంది జర్నలిస్టులతో మీడియా సమావేశం నిర్వహించి, విలేఖరులు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతూ, సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
పారదర్శకత, నిబద్దత ఉండాలన్న ఎమ్మెల్సీ కవిత
రాజకీయ నేతలకు పారదర్శకత, నిబద్దత ఉండాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టులకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లుగానే, కేంద్ర ప్రభుత్వం సైతం జర్నలిస్టులకు నిధులు కేటాయించేలా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) కేంద్రాన్ని డిమాండ్ చేయాలని, బీఆర్ఎస్ పార్టీ సైతం మద్దతుగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జర్నలిస్టుకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.