Pawan Kalyan: తెలంగాణ నేతల్లో ఆ మంచి గుణం భేష్! KTRకు పవన్ లేఖ - ఏపీలో లీడర్లకు చరకలు?
Pawan Kalyan Letter to KTR: భావ వైరుధ్యాలున్నా, రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉందని పవన్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారు. ఇటీవల జరిగిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. కళకు రాజకీయాలకు ముడి పెట్టకుండా ఉండే గుణం తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఉందంటూ కొనియాడారు. తర్వాతి రోజే బయో ఆసియా సదస్సు ఉన్నా కూడా.. సమయం కుదుర్చుకొని మరీ కేటీఆర్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి ప్రాంతీయ, భాషా, కుల, మత బేధాలు ఉండవు. భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ గారికి నిండు హృదయంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్‌తో కీలకమైన వర్చువల్ మీట్‌కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా.. సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత భావ వైరుధ్యాలు ఉన్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాల వారు ఆత్మీయంగా ఉండడాన్ని చూస్తాం. అటువంటి ఆత్మీయత కేటీఆర్ గారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలను కేటీఆర్ గారు చిత్తశుద్ధితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అని పవన్ కల్యాణ్ లేఖ రాశారు.
తెలంగాణ పోలీసులకు కూడా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించారని, ఎలాంటి అవాంతరాలు రాకుండా, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడంలో పోలీసులు చాలా ప్లానింగ్‌తో వ్యవహరించారని కొనియాడారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..
పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయ నాయకులను ప్రశంసించిన విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. కళకు, రాజకీయాలకు ముడిపెట్టని రీతిలో ఇక్కడి లీడర్లు ఉన్నారంటూ కొనియాడారు. కానీ, ఏపీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉంది. సినిమాలు, థియేటర్లపై ఆంక్షలు విధించడం, సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగించే రీతిలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించడాన్ని పవన్ కల్యాణ్ చాలా వేదికపై ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాజకీయాలను సినిమాకు ముడిపెట్టి, పగ తీర్చుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్ గతంలో రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు. తాజాగా తెలంగాణ నాయకులను ఆ విషయంలో మెచ్చుకుంటూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ @KTRTRS గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/VEneywDWQE
— JanaSena Party (@JanaSenaParty) February 24, 2022
తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు - @JanaSenaParty Chief Shri @PawanKalyan@TelanganaCOPs @hydcitypolice @CPHydCity @shobanjarahills @shojubileehills @HYDTP pic.twitter.com/Qa4wACzzRA
— JanaSena Party (@JanaSenaParty) February 24, 2022