(Source: ECI/ABP News/ABP Majha)
తెలంగాణ ప్రజల్లారా, ప్రధానమంత్రి మోదీని ఆశీర్వదించండి: కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆలస్యం కారణంగా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఆలస్యమయ్యాయి అన్నారు కిషన్ రెడ్డి. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన మోదీని ఆశీర్వదించాలని రిక్వస్ట్ చేశారు.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదికపై నలుగురికే కూర్చుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇద్దరు కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకు కుర్చీ వేశారు. ఈ వేదికపై నుంచి నేషనల్ హైవే పనులకు, బీబీనగర్ ఎయిమ్స్ బిల్డింగ్స్‌కు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ లైన్‌ను జాతికి అంకితం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు మోదీ.
ఈ వేదికపై మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రప్రభుత్వం చేసిన ఆలస్యం కారణంగా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఆలస్యమయ్యాయి అన్నారు. ఇంకా ఏమన్నారంటే"ప్రతి హిందువు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకుంటాడు. వాళ్ల సౌకర్యార్థం సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ట్రైన్ తెలుగు ప్రజలకు మోదీ అంకితం చేశారు. ఇది 14వ ట్రైన్. ఇందులో రెండు తెలుగు ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 714 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తారు. భవిష్యత్‌లో పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఈ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్- మహబూబ్‌నగర్ మధ్య 1410 రూపాయలతో చేపట్టిన డబ్లింగ్ లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా బీజేపీ ఎంపీల అభ్యర్థన మేరకు 13 కొత్త ఎంఎంటీఎస్ ట్రైన్లు, రెండో దశ పనులను జాతికి అంకితం చేస్తారు. ఏ రాష్ట్రాన్నైనా భేదభావం లేకుండా అభివృద్ధి చేస్తాం. 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశాం. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎన్నో రకాల లాభం చేకూర్చాం. అందుకే మోదీని ఆశీర్వదించాలని కోరుతున్నాను- కిషన్ రెడ్డి"
మరో మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్దమైందన్నారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని పిలుపునిచ్చారు. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వేల రూపురేఖలను మార్చేశారన్నారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం 4400 కోట్ల రూపాయలు కేటాయించినట్టు గుర్తు చేశారు.