Ponguleti Srinivas Reddy: బీసీ జనగణన తర్వాతే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బీసీ జనగణన తర్వాతే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Panchayat Elections in Telangana | హైదరాబాద్: బీసీ జనగణన అనంతరం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. నాలుగు గోడల మధ్య తాము ఏ నిర్ణయాలు తీసుకోవడం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని తెలంగాణ రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖల మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలిస్తుందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం (బీఆర్ఎస్ ప్రభుత్వం) కేంద్రంతో భేషజాలకు పోవడంతో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్లే, తెలంగాణ (Telangana State)కు సైతం న్యాయంగా రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని పొంగులేటి తెలిపారు.
గులాబీ పార్టీ పేకమేడలా కూలిపోతుంది, కారణం ఇదే
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నామ మాత్రంగా కూడా మిగిలే ప్రసక్తేలేదని, గులాబీ పార్టీ పేకమేడలా కూలిపోతుందని.. వారే కూల్చుకుంటున్నారని మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అధికారం ఇచ్చే పరిపాలన మీద ఫోకస్ చేయాలని కానీ, ప్రతిపక్ష నేతలు, లాయర్లు, జడ్జీలు, సినీ సెలబ్రిటీలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందకు ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలపై ఫోకస్ చేశారంటూ మండిపడ్డారు. వేలకోట్లతో నిర్మించినా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ అన్ని కుట్రల్ని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామన్నారు.
చచ్చిన పాము బీఆర్ఎస్‌ను ఇంకా చంపాలని లేదు
బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము అని, ఇంకా చంపాలని తాము అనుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను దిగమింగుకోలేక చెప్పాల్సి వస్తుందన్నారు. ధరణి (Dharani Portal) పేరుతో రైతులు, పేదల భూములు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ధరణి చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అని చెబుతాం, కానీ వారి చెడును కూడా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వేల కోట్ల ప్రజల సొమ్ముని కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. నాలుగు గోడల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని, తమది ప్రజా ప్రభుత్వం కనుక, వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అని బయటకి గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పులు ఎందుకు చేసిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సాయం అడిగితే నామోషీ అని మిషన్ భగీరథ లాంటి వాటికి గత ప్రభుత్వం (కేసీఆర్) నిధులు అడగలేదని చెప్పారు. తామెంతో చేశామని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లు గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ పథకం నీళ్లు రాష్ట్రంలో ఇంకా 30 శాతం మందికి చేరలేదని పేర్కొన్నారు.