NTR Daughter Death: ఎన్టీఆర్ కుమార్తె మరణం: పోస్టుమార్టం నివేదిక బయటికి, అందులో కీలక విషయాలు
ఉస్మానియాలో నిపుణులు అభిజిత్, టకియుద్దిన్, రమణ మూర్తి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. మెడ చుట్టూ తాడులాంటిది గట్టిగా బిగించుకోవడం వల్ల స్వర పేటిక విరిగి ఆమె చనిపోయినట్లుగా తేల్చారు.
Uma Maheshwari Post Mortem Report: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఇటీవల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 3న అంత్యక్రియలు జరిగాయి. కంఠమనేని ఉమామహేశ్వరి(57) చనిపోయిన కేసులో ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్య నిపుణులు పోస్టుమార్టం నివేదికను సమర్పించారు. శుక్రవారం వారు జూబ్లీహిల్స్ పోలీసులకు పోస్టుమార్టం నివేదికను అందజేశారు. ఈ నెల ఒకటో తేదీన ఉమా మహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకోగా, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఉస్మానియాలో నిపుణులు అభిజిత్, టకియుద్దిన్, రమణ మూర్తి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. మెడ చుట్టూ తాడులాంటిది గట్టిగా బిగించుకోవడం వల్ల స్వర పేటిక విరిగి ఆమె చనిపోయినట్లుగా తేల్చారు. అనుమానాస్పద మృతి కింద ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాక, ఉమా మహేశ్వరి కళ్లను దానం కూడా చేశారు.
ఉమా మహేశ్వరి కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించిన ప్రకారం.. 1న మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని వివరించారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షిత పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
అయితే, అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దీక్షిత వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఉమా మహేశ్వరికి ఇద్దరు పిల్లలు కాగా, వారు విశాల, దీక్షిత. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమార్తె వద్దనే ఉమా మహేశ్వరి ఉంటున్నారు.
వేరుగా పరామర్శించిన ఎన్టీఆర్
ఉమా మహేశ్వరి చనిపోయారనే వార్త తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఆమె ఇంటికి వచ్చారు. కానీ, ఎన్టీఆర్ విదేశాల్లో షూటింగ్ ఉండడం వల్ల చనిపోయినప్పుడు, అంత్యక్రియలకు ఎన్టీఆర్ హాజరు కాలేదు. షూటింగ్ నుంచి వచ్చాక, తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లారు ఎన్టీఆర్. మేనత్త ఉమా మహేశ్వరి కుమార్తెలను పరామర్శించారు. మేనత్త మరణంపై ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం.