Employment Guarantee Scheme: ఉపాధి హామీ సిబ్బందికి శుభవార్త.. నాలుగు నెలల జీతాలు విడుదల చేసిన ప్రభుత్వం
NREGS | ఉపాధి హామీ సిబ్బందికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల బకాయిలను విడుదల చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కానున్నాయి.

Employment Guarantee Scheme: హైదరాబాద్: పెండింగ్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధి హమీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలను ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలతో సహ మొత్తం 3200 మందికి పైగా సిబ్బందికి రూ.62 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే పలువురు ఖతాల్లో జీతాలు జమ అయ్యాయని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఉపాధి హామీ సిబ్బంది అందరికీ జీతాలు అందనున్నాయి.
గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు గ్రామపంచాయతీ స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ కేవలం రాష్ట్రస్థాయిలోనే నిఘా కమిటీలు ఉండగా.. తొలిసారి గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మే 2వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
సామాజిక తనిఖీ నివేదికలపై సమీక్ష జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉపాధి హామీ పనుల్లో పలుచోట్ల నిబంధనలను ఉల్లంఘించారని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 2025-26కు గానూ పనిదినాల సంఖ్యను 6.5 కోట్లకు తగ్గించడం తెలిసిందే.
గ్రామస్థాయి నిఘా కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామస్థాయి కమిటీలో అయిదుగురు చొప్పున ప్రభుత్వ సిబ్బంది ఉంటారు. వారానికి ఒకసారి పనులను పరిశీలించనున్నారు. మంజూరు చేసిన పని ఎంత, ఎంత మంది కూలీలు వచ్చారు. వారికి చెల్లింపుల వివరాలను చెక్ చేయనున్నారు. వీటిని మండల పరిషత్ అధికారులకు పంపితే.. వారు పరిశీలించిన అనంతరం కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. ఏవైనా అవకతవకలు జరిగితే కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని తెలిపారు.






















