NIA Arrests: హైదరాబాద్, భోపాల్‌లో ఉగ్ర చర్యలకు కుట్ర - మొత్తం 17 మంది అరెస్టు
సల్మాన్ రాజేంద్రనగర్ లో ఓ ఇంట్లో ఉంటుండగా ఎన్ఐఏ అధికారులు పక్కాగా అతణ్ని గుర్తించి పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాద కార్యకలాపాల విషయం తెరపైకి వచ్చింది. కొద్ది నెలల క్రితం భోపాల్ - హైదరాబాద్ పోలీసులు జరిపిన సోదాల్లో నగరంలో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ అరెస్ట్ అయిన వాళ్లతో సంబంధం ఉన్న మరొక వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం (ఆగస్టు 1) అరెస్ట్ చేశారు. వీరు హెచ్‌యూటీ (Hizb-Ut-Tahrir) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారు అని గుర్తించారు. సల్మాన్ అనే వ్యక్తి పరారీలో ఉండగా హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
సల్మాన్ రాజేంద్రనగర్ లో ఓ ఇంట్లో ఉంటుండగా ఎన్ఐఏ అధికారులు పక్కాగా అతణ్ని గుర్తించి పట్టుకున్నారు. అరెస్టు తర్వాత సల్మాన్ కు చెందిన రెండు ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సల్మాన్ ఇక్కడి నుంచే రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. సల్మాన్ ఇంటి నుంచి కీలక పత్రాలతోపాటు, ఎలక్ట్రానిక్ సామగ్రిని అధికారులు చేసుకున్నారు.
దేశంలో షరియా చట్టం అమలుకు హిజ్జుత్ తహ్రీర్ కుట్ర చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా హిజ్బ్ - ఉత్ - తహ్రీర్ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ ఏడాది మే 24న హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మధ్యప్రదేశ్, తెలంగాణలో మొత్తం 16 మందిని అరెస్టు చేయగా.. తాజాగా సల్మాన్ అరెస్టుతో ఆ సంఖ్య 17కు చేరింది. హైదరాబాద్‌లో అరెస్టు అయిన సల్మాన్ హిజ్బ్ - ఉత్ - తహ్రీర్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లుగా వెల్లడి అయింది. మే 24న హైదరాబాద్‌లో సలీమ్, మరో ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.