కిరాణా షాప్‌లో బకరా తీసుకో బ్రో- టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కోడ్ లాంగ్వేజ్
మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలాజీ, రాంకిశోర్, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో...టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలాజీ, రాంకిశోర్, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో...టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉండటంతో...డ్రగ్స్ దందాతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? ఉంటే ఎలాంటి సంబంధాలు సినిమా రంగానికే పరిమితమా ? లేదంటే డ్రగ్స్ తీసుకుంటున్నారా ? అన్నకోణాల్లో పోలీసులు కూపీ లాగుతున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించేందుకు రెడీ అవుతున్నారు.
నిర్మాతలు ఉప్పలపాటి రవి, వెంకటరత్నారెడ్డిలకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ, విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్ ద్వారా డ్రగ్స్ చేరేవి. బెంగళూరు నుంచి కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకొచ్చేందుకు రాంకిశోర్ సహకరించేవాడు. బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి...హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖులకు విక్రయిస్తున్నారు. మాదాపూర్, గచ్చిబౌలిలోని అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని పార్టీలు నిర్వహించేవారు. మోడళ్లు, సినిమా ఛాన్స్ ల అవకాశాల కోసం ఎదురుచూసే అమ్మాయిలను డ్రగ్స్ ఎరవేసి పార్టీలకు ఆహ్వానించేవారు.
సరకు ఆర్డర్‌కు బకరా.. కోక్.. శాండిల్ వంటి కోడ్ భాష ఉపయోగిస్తున్నారు. నగదు చేతిలో పడ్డాక మాత్రమే సరుకు ఎక్కడ తీసుకోవాలో సమాచారం ఇస్తారు. ముందుగా నిర్ణయించిన కిరాణా, పాన్, పాల దుకాణాల వద్ద డ్రగ్స్ ప్యాకెట్లు అందజేస్తారు. దీనికి ప్రతిఫలంగా దుకాణదారులకు కొంత కమీషన్ ముట్టజెబుతున్నారు. కొన్ని ముఠాలు నిర్మానుష్య చీకటి ప్రదేశాలల్లో పొట్లాలు ఉంచి దూరంగా ఉండి గమనిస్తారు. ఇరువైపుల లావాదేవీలు పూర్తయినట్లు ధ్రువీకరించేందుకు ‘బ్రో’ అనే సిగ్నల్స్ ఉపయోగిస్తున్నట్లు తెలింది.
డ్రగ్స కేసులో ఇటీవల అరెస్టయిన 8 మంది నిందితులకు కస్టడీ కోరుతూ...పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్, మురళీ వెంకట రత్నారెడ్డిలను అరెస్ట్ చేసినప్పుడు బయటపడిన సమాచారంతో ఈ నెల 14న ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌రావు, రాంచంద్, కె.సందీప్, సుశాంత్‌రెడ్డి, శ్రీకర్ కృష్ణప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 7 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
డ్రగ్స్ దందాలోని నైజీరియన్లు బెంగళూరు చేరగానే నకిలీ పాస్‌పోర్టు, వీసాలు తయారు చేస్తారు. వాటిని ఉపయోగించుకొని ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. నైజీరియన్ సిమ్‌కార్డులను ఉపయోగించి వైఫై వాట్సాప్, షేర్‌చాట్ ద్వారా పెడ్లర్స్, ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంభాషణలు, చాటింగ్స్ ఎన్‌క్రిప్ట్‌లో ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కొనుగోలుదారులు పట్టుబడినా వారి నుంచి లభించే ఐపీ అడ్రస్ ఆధారంగా సూత్రదారులను గుర్తించటం సవాల్‌గా మారుతోంది. నగరం నుంచి కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన వారికి తమ చిరునామా, ముఖం తెలియకుండా నైజీరియన్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రధాన నగరాలలో ఉండే నైజీరియన్లతో టచ్‌లో ఉంటూ పలువురు డ్రగ్ కొనుగోళ్లు చేస్తూ హైదరాబాద్‌లో విక్రయాలు సాగిస్తున్నారు. ఇందులో సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఉంటున్నారు. గతంలో కబాలి సినిమా డైరెక్టర్ కేపీ చౌదరి, సినీ ఫైనాన్సియర్ వెంకటరత్నారెడ్డి అరెస్ట్ కావడంతో.. వారితో ఆయా ఫిల్డ్‌లో ఉన్న వారికి డ్రగ్ సంబంధిత లింక్‌లు బయటకు వస్తున్నాయి. డ్రగ్ వినియోగదారులుగా మారి, ఆ తరువాత డ్రగ్ పెడ్లర్స్‌గా మారడం సర్వసాధారణమవుతుంది. ప్రత్యేక ఈవెంట్లు, పార్టీలు నిర్వహిస్తూ అందులో డ్రగ్‌ను ఉపయోగిస్తున్నారు. పబ్ నిర్వాహకులే ఏకంగా డ్రగ్‌కు అలవాటు పడి, ఆయా పబ్‌లలో డ్రగ్ విక్రేతలకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ టీనాబ్ దర్యాప్తులో బయటపడుతున్నాయి.