Komatireddy Venkat Reddy: చర్చనీయాంశంగా కోమటిరెడ్డి తీరు.. వద్దన్నా అటు వెళ్లిన ఎంపీ, పైగా సమర్థన
కాంగ్రెస్ నేతలెవరూ విజయమ్మ నిర్వహించే వైఎస్ సంస్మరణ సమావేశానికి వెళ్లవద్దంటూ తెలంగాణ పీసీసీ నిర్ణయించినప్పటికీ.. ఎంపీ కోమటిరెడ్డి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అసంతృప్తిని ఇంకా కొనసాగిస్తున్నారు. పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ ఆయన తెలంగాణలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడంతో పాటు వ్యాఖ్యలు కూడా అలాగే చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ హజరు కావడం చర్చనీయాంశం అయింది. ఆ సమావేశానికి కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లవద్దంటూ తెలంగాణ పీసీసీ నిర్ణయించినప్పటికీ.. కోమటిరెడ్డి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరీ కోమటిరెడ్డి వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రిగా ఉండేవారని, తనకు విజయమ్మ నుంచి ఆహ్వానం అందగానే సభకు వస్తానని మూడు రోజుల ముందే ఆమెతో చెప్పానని కోమటిరెడ్డి అన్నారు. ఈ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు తెలియదని అన్నారు. ఒకవేళ మీటింగ్‌కు వెళ్లొద్దని ఆదేశాలు ఇస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. తమ పార్టీ నేతలు ఇతర పార్టీల నేతల ఇళ్లలోకి వెళ్లి వాళ్ల కాళ్లు మొక్కుతుంటే తమ పార్టీకి చెందిన వైఎస్ సంస్మరణ సభకు వెళ్లడంలో తప్పు లేదని అన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానినని స్పష్టం చేశారు.
‘‘నాలాంటి ఎంతో మంది సామాన్య కార్యకర్తలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను చేశారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో విజయం సాధించారు. వైఎస్‌కు మరణం లేదు. వైఎస్ పేరు చెబితే ఎక్కడకు వెళ్ళినా చప్పట్లు కొడతారు. పేదల కళ్ళల్లో నీళ్ళు వస్తే మన కళ్ళలో నీరు రావాలి. కానీ ప్రజల కళ్ళలో కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని వైఎస్ నాతో చెప్పారు. వైఎస్ బతికి ఉంటే భారత దేశంలోనే గొప్ప నాయకుడిగా ఉండేవారు.’’ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేసి ఆ తర్వాత తగ్గించారు. కానీ, తన అసహనాన్ని మాత్రం అంతే కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. అందుకోసం సోనియాతో తాను మాట్లాడతానని అన్నారు. మళ్లీ ఇప్పుడు విజయమ్మ ఎపిసోడ్‌తో మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించారు.