Shadnagar Case: రాజకీయం చేస్తే రోడ్డున పడతాం- చోరీ సొత్తు ఇప్పించండీ- షాద్‌నగర్ కేసులో ఫిర్యాదుదారుల ఆవేదన
Hyderabad ; సంచలనాలకు కేరాఫ్‌గా మారిన షాద్‌నగర్ కేసు మరో మలుపు తీసుకుంది. తమ చోరీ కేసు తేల్చి పెళ్లికి ఉంచున్న సొత్తు ఇప్పించాలని బాధితులు మీడియా ముందుకు వచ్చారు.
Crime News: షాద్ నగర్ కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. దొంగతనం కేసును రాజకీయం చేసి తండ్రిలేని పిల్లలకు అన్యాయం చేస్తారా అని ఇప్పుడు మరో వర్గం ప్రశ్నిస్తోంది. ఈ కేసులో అరెస్టైన మహిళను ప్రతిపక్షాలు పరామర్శించడాన్ని తప్పుబడుతోంది. తాము కూడా దళితులమేనంటూ గుర్తు చేస్తున్నారు.
షాద్‌నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన బంగారం, నగదు దొంగతనం కేసు రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇవాళ మరో వర్గం మీడియా ముందుకు వచ్చింది. హుబ్బని నాగేందర్, అతని భార్య నీలవేణి, బాధితుడు సోదరి రేణుక వచ్చి జరుగుతున్ని పరిణామాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో గత నెల 24న బంగారం, నగదు దంగొతనం జరిగిందని తెలిపారు. రాత్రి పగలు కూడబెట్టిన డబ్బులతో తన చెల్లి రేణుక పెళ్లి చేయాలని నిశ్చయించి 24 తులాల బంగారం కొన్నట్టుచెప్పారు. 24న తామంతా ఉద్యోగాలకు పిల్లలు బడికి వెళ్లారని చెప్పారు. పిల్లలు బడి నుంచి వచ్చే చూస్తే ఇంటి లోపల నుంచి గడియ పెట్టి ఉందని వెనక భాగం తలుపులు తీసి ఉన్నాయని చెప్పారు. లోపలికి వెళ్లి చూస్తే... బీరువా తలుపులు తెరిచి ఉన్న విషయాన్ని గుర్తించారని పేర్కొన్నారు. దీనిపై షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సిఐ రాంరెడ్డి తమ కేసు తీసుకున్నారని చెప్పారు.
అదే ప్రాంతంలో ఉంటున్న సునీత అనే మహిళ ఇంటి వద్ద తమ బంగారు నగరు చూసినట్టు చెల్లెలు రేణుక తమకు చెప్పిందని నాగేందర్ అన్నారు. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరిశీలిస్తే తమకు సంబంధించిన వస్తువులు కనిపించాయని బాధితుడు చెప్పారు. ఆమెను నిలదీస్తే మల్లేశ్వరి పేరు చెప్పిందని ఇద్దర్నీ పోలీసులు అదుపులోకీ తుసుకున్‌నారని గుర్తు చేశారు. చోరీ సొత్తుపై రకరకాలుగా చెప్పి అందర్నీ తప్పుదారి పట్టించారని అన్నారు. అందుకే ఆమెను మరింత సుదీర్ఘంగా విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని చెప్పారు.
థర్డ్ డిగ్రీ జరిగిందని సునీత చెప్పడంతో తమ కేసు పక్కదారి పట్టిందన్నారు నాగేందర్. అక్కడ ఏం జరిగిందో తమకు తెలియదన్న నాగేందర్... సునీతకు జమానత్ ఇచ్చేవాళ్ళు లేరని తెలిసి జమానత్ ఇచ్చి ఇంట్లో వదిలి పెట్టామన్నారు. జాలితో చేసిన ఈ పనిని కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నారని వాపోయారు. సునీత విషయంలో స్పందించి ఎస్సీ కమిషన్ తమ ఇంటిలో జరిగిన చోరీ సంగతి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తామూ దళితులమేనని తమ బాధలను ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. పెళ్లి కోసం దాచుకున్న వస్తువులు, నగదు, డబ్బు పోయినందని మాత్రమే ఫిర్యాదు చేశామన్నారు. కావాలనే కొందరు సునీతను ఆసుపత్రిలో చేర్పించి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రాజకీయాలు చేస్తున్న వారు తమ సమస్యలు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నాగేందర్ ఫ్యామిలీ నిలదీసింది. ఇంట్లో 24 తులాల బంగారం 2 లక్షల నగదు అపహరణకు గురైతే అడగొద్దా అని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం జరిగిన ఘటనను రాజకీయాలకు వాడుకుంటున్న వాళ్లు తమ సమస్యలు పట్టించుకోరా అని నిలదీశారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటివారు ఒకరి వాదన విని వెళ్లిపోవడం సరికాదన్నారు. దొంగతనం జరిగిందా? జరగలేదా? అని తెలుసుకోవాలని సమగ్ర విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని బాధితులు పేర్కొన్నారు. వచ్చి నేతలంతా సునీత ఫ్యామిలీ నేర చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.
అందుకే దొంగతనం కేసు పక్కదారి పట్టించొద్దని వేడుకున్నారు నాగేందర్ ఫ్యామిలీ. చోరీ కేసుపై పోలీసులు సక్రమంగా విచారణ జరిపి న్యాయం చేయాలని చెప్పారు. తమగోడు కూడా పట్టించుకోవాలని పెళ్లి చేయకపోతే రేణుక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దొంగతనం కేసును అడ్డంగా పెట్టుకుని రాజకీయం చేస్తే తమ కుటుంబం వీధిన పడుతుందని అన్నారు.