Bharath Jagruthi: తెలంగాణ జాగృతి తరహాలో భారత్ జాగృతి - దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కార్యవర్గాలు - కవిత వెల్లడి
Bharath Jagruthi: తెలంగాణ జాగృతి తరహాలోనే దేశ వ్యాప్తంగా భారత్ జాగృతి ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
Bharath Jagruthi: రాష్ట్రంలో తెలంగాణ జాగృతి లాగా దేశ వ్యాప్తంగా భారత్ జాగృతి ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి పంథాను మార్చుకొని, దేశ ప్రజలను చైతన్య పరిచేలా, చర్చను రగిలించేలా కార్యాచరణ మొదలు పెడతామని అంటున్నారు. తెలంగాణ జాగృతి తరహాలోనే భారత్ జాగృతి రిజిస్టర్ చేశామన్నారు. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడతామని వెల్లడించారు. భారత్ జాగృతి, ఇండియా టుడే భాగస్వామ్యంతో సాహిత్య జాగృతి పేరిట ఇటీవల కార్యక్రమం జరిగింది. జ్ఞానపీఠ్ తరహాలో ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చేందుకు తెర వెనక కొందరు కవులు, రచయితలు, కళాకారులు పని చేస్తున్నారు.
తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి నడుమ సోదర బంధం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. మనకు బతుకమ్మ తరహాలో ఏపీ ప్రజలకు అట్ల తద్దె, బిహార్ లో ఛత్ పూజ లాంటివి ప్రసిద్ధి అని పేర్కొన్నారు. అందరి సమస్మృతులను గౌరవిస్తూ జాతీయ భావన కొనసాగిస్తామన్నారు. బుర్జ్ ఖలీఫా పైకి బతుకమ్మ ఎక్కడం వెనక 12 ఏళ్ల శ్రమ ఉందని కవిత పేర్కొన్నారు.
దేశంలో ఉన్న సమస్యలపై భారత్ జాగృతి పోరాటం..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను ఏకం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని జాగృతి కాపాడుతోందన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ జాగృతికి జయశంకర్ సార్, కేసీఆర్ లు గురువులన్నారు. 8 ఏళ్లలో పరిపుష్టమైన కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. ఆనాడు బతుకమ్మను ఎత్తుకోవాలంటే సిగ్గుపడ్డారన్నారు. మన కళలు, సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చుకున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటామన్నారు. మన పండుగలను, కళలను కాపాడుకున్నామని కవిత అన్నారు. భారత్ జాగృతి ద్వారా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యథావిధిగా కొనసాగుతుందని ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నందున ఇంకా అక్కడ తమ వ్యూహాలు ఆలోచించలేదని చెప్పారు.
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని కవిత తెలిపారు. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాల నాయకులు చాలా మంది తమ పార్టీలో చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు మహిళలను, బతుకమ్మను కూడా అహేళన చేస్తూ మాట్లాడన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్ తన గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం బాధాకరం అన్నారు. ప్రజలంతా వీటిని చూస్తున్నారని.. సరైన సమయంలో వాళ్లే బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పుకచ్చారు. బీఆర్ఎస్ ఏర్పాటు వల్ల బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటూ ఎద్దేవా చేశారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేసి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా వ్యూహాలను రచిస్తామన్నారు.