Miss World 2025: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, కమిటీ ఏర్పాటు
Miss England Milla Magee | తనను వేశ్యలా చూశారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.

Miss England Milla Magee allegations | హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తెలంగాణలో తనకు ఎదురైన చేదు అనుభవంపై చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీ నియమించింది. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఉన్నారు.
ఈ కమిటీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లను అడిగి పోటీల నిర్వహణ తీరును తెలుసుకోనుంది. ఈవెంట్ కోసం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అందగత్తెలను ఆరా తీయనున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలను ఈ కమిటీ తెలుసుకోనుంది.
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వంపై ఇంగ్లాండ్ భామ మిల్లా మాగీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవెంట్‌కు వచ్చిన తనను వేశ్యలా ట్రీట్ చేశారని, దారుణ అనుభవం ఎదురైందని ఆరోపిస్తూ ఆమె ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిపోయారు. మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్ లో ఎవరెవరు ఉన్నారు. ఆరోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలను కమిటీ సేకరించి పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి అందించనుంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వేశ్యలా చూస్తున్నారని మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ ఈవెంట్‌కు హాజరైన తనకు చేదు అనుభవం ఎదురైందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపించారు. రిచెస్ట్ పర్సన్స్ అయిన పురుష స్పాన్సర్లను ఎంటర్‌టైన్ చేయాలనడంతో ఒత్తిడికి గురైనట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌పై ఆరోపణలు చేశారు. అసలు తాము ఇక్కడికి ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదని, ఇవేం పోటీలంటూ అందాల పోటీల మధ్యలోనే ఆమె వైదొలిగి ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయారు. ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోయిన మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల్ని బ్రిటన్ మీడియా రిపోర్ట్ చేయడంతో వివాదం బయటపడింది. అయితే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే మాత్రం మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. ఆమె నిరాధార ఆరోపణలు చేశారంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సైతం మిల్లా మాగీ వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు.






















