Hyderabad: ఎవరూ బయటికి రావొద్దు, ఎమర్జెన్సీ అయితే ఈ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయొచ్చు - మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: కార్పొరేటర్ లు తమ డివిజన్ లలో పర్యటించాలని, అక్కడి పరిస్థితులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తలసాని నిర్దేశించారు.
Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక సూచన చేశారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైద్రాబాద్ నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు GHMC అధికారుల సహాయం కోసం 040 - 21111111 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని చెప్పారు.
కార్పొరేటర్ లు తమ డివిజన్ లలో పర్యటించాలని, అక్కడి పరిస్థితులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని నిర్దేశించారు. నాలాలు, బ్రిడ్జిలు, చెరువుల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
మరో మూడు గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు - IMD హెచ్చరిక
మరోవైపు, హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం చేసిన తాజా ప్రకటన మేరకు ( జూన్ 10 మధ్యాహ్నం 12 గంటలకు చేసిన ట్వీట్) తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఐఎండీ అధికారులు సంబంధిత వాతావరణ అంచనాల నివేదికను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు.
నైరుతి రుతుపవనాలు, ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేటలో అధికంగా 20.6 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ముథోల్‌లో 19.1, భైంసాలో 16.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 4,92,415 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
ఇప్పటికే 57 టీఎంసీల నీటి మట్టం..
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 57 టీఎంసీలుగా ఉంది, పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు. కేవలం 48 గంటల వ్యవధిలోనే 27 టీఎంసీల వరద వచ్చి చేరింది. గంట గంటకు వరద ఉధృతి పెరిగిపోతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1081 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. కాగా, ప్రస్తుతం సగానికి పైగా టీఎంసీల నీరు ఉంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.