Telangana News : డబుల్ బెడ్ రూం ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారా ? ఇదిగో తెలంగాణ సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్
హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి తలసాని గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల రెండో తేదీన పట్టాలు పంపిణీ చేయనున్నారు.
Telangana News : పేదల కోసం నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేసే ముహుర్తాన్ని తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 2న కుత్బుల్లాపూర్‌లో ఇండ్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ డ్రా తీయాలని నిర్ణయించారు. ఎన్‌ఐసీ రూపొందించిన ర్యాండమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప ్రకటించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా 12 వేల మందికి ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్థిక సహాయంతో ఇండ్లను నిర్మించాయని .. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి అందిస్తున్నారని తలసాని చెబుతున్నారు.
పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని తలసాని చెబుతున్నారు. మొత్తం 12 వేల మందికి రెండు పడక గదుల ఇండ్ల పట్టాలు అందించే అంశంపై హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి మహమూద్ అలీతో కలిసి డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మంత్రి తలసాని ప్రారంభించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మొద్దని సూచించారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదల సొంతిల్లు కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గ్రేటర్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 2,500 మంది చొప్పున మెుత్తం 60 వేల మంది లబ్ధిదారులతో ఇప్పటికే జాబితా సిద్ధం చేశారు. వీరిలో ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున మెుత్తం 12 వేల మందిని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. వీరి పేర్లను లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ డ్రా తీసి వెల్లడిస్తారు. లబ్ధిదారుల ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసేందుకు అధికారులు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. పేర్లు, నంబర్లు ఒక డబ్బాలో వేసి లక్కీ డ్రా తీసినట్టు కాకుండా యాదృచ్ఛిక నమూనా (ర్యాండమైజేషన్) సాఫ్ట్‌వేర్ ద్వారా పేర్లు, వివరాలు వెల్లడి కానున్నాయి. ఇళ్లు పొందిన లబ్ధిదారుల పేర్లు స్పష్టంగా కనిపించేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా డిజిటల్ డిస్ ప్లేలను ఏర్పాటు చేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ సర్కార్ నిర్మిస్తోంది. ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని గతంలో పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ప్రకటించారు. ఇప్పటికే కొన్ని ఇళ్లను పంపిణీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండనుంది.