KTR News: బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభ వేడుకకు దూరంగా కేటీఆర్, కారణం ఏంటంటే
ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతితో ఆయన బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.
Minister KTR News: తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ఢిల్లీలో నేడు (డిసెంబరు 14) ప్రారంభించనున్న బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరు కాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతితో ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. కేటీఆర్ షెడ్యూల్ లో ముందే నిర్ణయించిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాలు ఉండగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ప్రఖ్యాత వాహన దిగ్గజం మారుతి సుజుకికి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో ఓ సమావేశం ముందే నిర్ణయం అయింది. మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధుల టీమ్ హైదరాబాద్ చేరుకున్నారు. జపాన్ కు చెందిన సుజుకి కంపెనీతో గత కొంతకాలంగా విస్తృతంగా పెట్టుబడుల సంప్రదింపులు నడుస్తున్నాయి. సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి, మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఉదయం 10.45కు హైదరాబాద్ హైటెక్ సిటీలోని సలార్పురియా నాలెడ్జ్ పార్కులో Bosch ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం కూడా ఉంది. ఈ రెండు కీలక సమావేశాలు నేపథ్యంలో ఈ ఉదయం ఢిల్లీ చేరుకోవాల్సిన కేటీఆర్, ముఖ్యమంత్రి ప్రత్యేక అనుమతితో హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. రెండు కార్యక్రమాల కారణంగా కేసీఆర్ అనుమతితోనే ఢిల్లీ వెళ్ళడం లేదని కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రం బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి నిన్న రాత్రే (డిసెంబరు 13) ఢిల్లీకి చేరుకున్నారు.
నేడు మధ్యాహ్నం 12:47 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర కార్యాలయంలో మొదట కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కార్యాలయం ప్రారంభోత్సవం చేసి, కేసీఆర్ తన గదిలో కూర్చుంటారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరు కానున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్‌తో భావసారూప్యం కలిగిన జాతీయ నాయకులను ఆహ్వానించామని చెప్పారు. ఈ రోజు నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.
పార్టీ ఆఫీసు ఢిల్లీలో ఎక్కడంటే
ఢిల్లీ నడి బొడ్డున సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తోపాటు దేశంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, రైతు సంఘాల నేతలు హాజరు అవ్వనున్నారు.