Minister Kishan Reddy: మీతో నీతులు చెప్పించుకునే స్థితిలో మేము లేము - బీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
Minister Kishan Reddy: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైను ఎందుకు ఆహ్వానించలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Minister Kishan Reddy: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైను బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని అన్నారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా అంటూ ప్రశ్నించారు. అలాగే కేంద్రం నిర్వహించే సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం బాధ్యతా రాహిత్యమే అవుతుందని దుయ్యబట్టారు. అలాగే రేపు జరగబోయే నీతి అయోగ్ సమావేశానికి కూడా బీఆర్ఎస్ దూరంగా ఉండడం దుర్మార్గపు చర్య అని మండి పడ్డారు. సీఎం కేసీఆర్ వల్ల.. పోరాడి సాధించుకున్న తెలంగాణ చాలా నష్ట పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Live: Press Meet, Vidya Nagar, Amberpet. https://t.co/FBOsOqPotO
— G Kishan Reddy (@kishanreddybjp) May 26, 2023
ప్రధాన మంత్రి అధికారిక కార్యక్రమాలకు సీఎం రాకపోవడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ కు మహారాష్ట్ర వెళ్లేందుకు తీరిక ఉంది కానీ... అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ జయంతికి పూలమాల వేయటానికి తీరిక దొరకదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కావాలనే సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి చూపిస్తున్నారన్నారు. అలాగే అవకాశం ఉన్న చోట తెలంగాణ గొంతు వినిపించడంతో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మకమైన వైఖరి వల్ల తెలంగాణకు చాలా నష్టం వాటిల్లుతోందని వివరించారు. జూన్ 3, 4 వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగే బాజ్ మేళాకు భారీగా హాజరు కావాలని నిరుద్యోగులకు సూచించారు.
Live: Press Meet on Job Mela, National Training Institute, Vidya Nagar, Amberpet. https://t.co/vIIdg7MU9C
— G Kishan Reddy (@kishanreddybjp) May 26, 2023
'రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారు'
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ లో చేరికల గురించి మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో తలకు మాసినోళ్లు చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ఫ్లెక్సీల్లో వేసుకుంటే దేశ్ కి నేత కాలేరని అన్నారు. కేసీఆర్ ఎకరాకు 10 వేలు మాత్రమే ఇస్తున్నారని, మోదీ సర్కారు ఎకరాకు కేవలం ఎరువుల సబ్సిడీతోనే 18 వేల 254 రూపాయలు ఇస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ఎరువులు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరుణంలోనూ ఎరువుల ధరలు పెరిగినా రైతులపై అదనపు భారం వేయడం లేదని చెప్పుకొచ్చారు. ప్రతీ బస్తా మీద ధరలు ముద్రిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ తీరు గురువింద గింజ సామెతలా ఉందని విమర్శించారు. ఉట్టికి ఎగురలేని వారు ఆకాశానికి ఎగిరినట్లు కేసీఆర్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. డిజిటల్ ట్రాన్సక్షన్ లో భారత్ నంబర్ వన్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు.