Marri Shashidhar Reddy Expel: మర్రి శశిధర్ రెడ్డికి షాక్, కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన టీపీసీసీ
Congress expel Marri Shashidhar Reddy: మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు.
Marri Shashidhar Reddy expel from Congress Party: మాజీ మంత్రి, కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బండి సంజయ్, డీకే అరుణతో కలిసి భేటీ అయ్యారు శశిధర్ రెడ్డి. ఆ మరుసటి రోజు కాంగ్రెస్ అధిష్టానం మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరెళ్ల పాటు బహిష్కరిస్తూ టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్
కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసిన తర్వాత బయటకు వచ్చి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పైన, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది.. ఎంతో మంది వచ్చారు. పోయారు కానీ పార్టీ అలాగే నిలబడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కి కాన్సర్ వచ్చిందని మర్రి శశిధర్ రెడ్డి అనడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందంటూ మండిపడ్డారు. పార్టీ మారి బీజేపీ లో చేరాలని అనుకునే వారు, వారికి పోయే స్వేచ్ఛ ఉంది, కాని కాంగ్రెస్ ను నిందించే హక్కు లేదన్నారు. ఎవరు ఎలాంటి వారో ఏ పార్టీ ఎలాంటిదో భవిష్యత్ లో తేలిపోతుందని మల్లు రవి అన్నారు.
బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి !
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం నాడు కలిశారు. అమిత్ షాతో శశిధర్ రెడ్డి భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరికపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర మంత్రి అమిత్ షాతో కాసేపు చర్చించారు. పార్టీలో చేరికను బీజేపీ పెద్దలు స్వాగతించినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ తిరిగొచ్చాక తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి మంచిరోజున పార్టీలో చేరుతానని శశిధర్ రెడ్డి అన్నట్లు సమాచారం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. రెండు మూడు రోజుల్లోనే జేపీ నడ్డా సమక్షంలో శశిధర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ ఎమ్మెల్యే టిక్కెట్ తనకే లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనిపై బీజేపీ పెద్దలు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ సందర్భంగా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి గురించి తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ ప్రస్తావించారు. వెంటనే అమిత్ షా ఫోన్ చేసి అరవింద్‌తో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఏ ఆందోళన చెందవద్దని, మన పోరాటం కొనసాగాలని సూచించారు.
ఇటీవల రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..
మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం రెండు రోజుల కిందట ఒక్క సారిగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. డీకే అరుణతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారని బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిసి ఆ పార్టీలో చేరుతారని ఒక్క సారిగా గుప్పుమంది. అయితే ఈ ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు.. వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లడం కొత్త కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చినట్లు చెప్పారు. తానింకా రాజకీయాల్లో ఉన్నానని, రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.