Liquor Shops Tender: మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్, డ్రా పద్ధతి ద్వారా లైసెన్సులు: ఎక్సైజ్ శాఖ
Liquor Shops Tender: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Liquor Shops Tender: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకీ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 2023 నుంచి 25 వరకు రెండేళ్ల కాలపరిమితితో ఈ లైసెన్స్ లు ఇవ్వనుంది సర్కారు. పాత విధానం ద్వారానే మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వనున్నారు. దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజులో రాష్ట్ర సర్కారు ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నెల 3వ తేదీన జిల్లాల వారీగా తెలంగాణ అబ్కారీ శాఖ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ నెల 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు 20, 21వ తేదీల్లో లాటరీని నిర్వహించనున్నారు. డ్రా పద్ధతి ద్వారా దుకాణాలకు లైసెన్సులు ఇవ్వనున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియను తెలియజేశారు. దుకాణాల సంఖ్య, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కూడా ఒకే విధంగా ఉండటంతో అబ్కారీ శాఖ గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.
2021 నుంచి మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు
మద్యం దుకాణాల కేటాయింపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 నుంచి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు మద్యం దుకాణాల్లో(Wine Shops) రిజర్వేషన్లు అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడలకు 15 శాతం(363), ఎస్సీలకు 10 శాతం (262), ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించారు. వంద శాతం లాభాలతో నడిచే వ్యాపారమైన మద్యం దుకాణాలను స్థానికులకే కేటాయిస్తూ వస్తున్నారు. అన్ని విధాలుగా స్థానికులకు లాభాలు చేకూరే విధంగా నూతన మద్యం పాలసీని రూపొందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు రిజర్వేషన్ ప్రకారం 756 మద్యం దుకాణాలు కేటాయిస్తున్నారు. 1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. గౌడ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మద్యం షాపులకు రిజర్వేషన్లు(Reservations) అమలు చేస్తున్నారు.
ఒక్క బ్యాంకు గ్యారెంటీ చాలు
మద్యం దుకాణాల యజమానులకు 2021 నుంచి బ్యాంకు గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో రెండు బ్యాంకుల గ్యారెంటీలు ఇవ్వాల్సి ఉండగా, 2021 నుంచి ఒకటే గ్యారెంటీ తీసుకుంటోంది. దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు అంతకుముందు లాగే అమలు చేస్తోంది. ప్రివెలన్స్ ఫీజు కూడా ఏడింతల నుంచి పదింతలు చేసింది. లైసెన్స్ ఫీజు స్లాబులను 8 నుంచి 12కి పెంచింది.