KTR About Kavitha Arrest: వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారు- ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం
Money laundering case: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే కేటీఆర్, హరీష్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు.
MLC Kavitha was arrested in Money laundering case: మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమెకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాదాపు నాలుగైదు గంటలపాటు ఈడీ, ఐటీ అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడి ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సాయంత్రం కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాత్రి 8.45 ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. కవితకు నోటీసులు, అరెస్ట్ సమాచారం అందుకున్న కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు.
కవిత అరెస్ట్ అక్రమమని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత కవితను ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఎందుకు తప్పుతున్నారు, తరువాత మీరు కోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను కేటీఆర్ హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చి కవితను అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కవిత ఇంట్లోకి రావద్దు అంటూ హుకూం ఎలా జారీ చేస్తారంటూ మండిపడ్డారు.
కవిత ఇంటి వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 3లో ఉన్న కవిత నివాసంలోనే ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి దాదాపు 12 మంది అధికారులు వచ్చారు. దాదాపు 7 మంది అధికారులు బయటే ఉండగా, 5 మంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు చేసింది. వీరిలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నట్లు సమాచారం. కవిత ఇంట్లో శనివారం వరకు సోదాలు జరుగుతాయని మొదట ప్రచారం జరిగింది. అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు ఇచ్చిన అనంతరం ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. కవితను అదుపులోకి తీసుకుంటారని సమచారం తెలియగానే బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అరెస్ట్ అక్రమమని, కుట్రపూరితంగా ఆమెను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.