KA Paul: ఓరేయ్, కొడతాను నిన్ను - కోపంతో ఒంటికాలుపై లేచిన కేఏ పాల్
రోడ్డును తవ్విన కాంట్రాక్టర్ పై ఒంటికాలుపై లేచారు. తాను నివాసం ఉంటున్న ఇంటి ముందు రోడ్డు తవ్వొద్దని చెప్తే ఎందుకు తవ్వారని ఆర్ అండ్ బి సిబ్బందిని కేఏ పాల్ నిలదీశారు.
ఓ కాంట్రాక్టర్ పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహంతో ఊగిపోయారు. హైదరాబాద్ అమీర్ పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయం ముందు రోడ్డును తవ్వడం కేఏ పాల్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. రోడ్డును తవ్విన కాంట్రాక్టర్ పై ఒంటికాలుపై లేచారు. తాను నివాసం ఉంటున్న ఇంటి ముందు రోడ్డు తవ్వొద్దని చెప్తే ఎందుకు తవ్వారని ఆర్ అండ్ బి సిబ్బందిని కేఏ పాల్ నిలదీశారు.
‘‘ఇక్కడ రోడ్డు తవ్వవద్దని నీకు ఇంజినీర్లు, మేయర్ చెప్పారు కదా? ఎందుకు తవ్వావు? జస్ట్ గెట్ అవుట్, లేదంటే మేమే గెంటేస్తాం’’ అని కేఏ పాల్ ఆర్ అండ్ బీకి చెందిన ఓ వ్యక్తిపై అరిచారు. దీనికి ఆ వ్యక్తి కూడా దీటుగానే స్పందిస్తూ.. ‘‘ఫస్ట్ సరిగ్గా మాట్లాడండి. నా దగ్గర గవర్నమెంట్ ఆర్నమెంట్ ఉంది’’ అని ఆ వ్యక్తి చెప్పగా, ఇంజినీర్లు, మేయరే అక్కడ రోడ్డు తవ్వవద్దని నీ ముందే చెప్పారని కేఏ పాల్ గట్టిగా చెప్పారు.
అంతటితో ఆగకుండా కేఏ పాల్ మరో వ్యక్తితో వాదనకు దిగారు. ఒరేయ్.. కొడతాను నిన్ను.. కొడతాను.. ఇంజినీర్లు అందరూ వచ్చి చెప్పారు.. ఇక్కడ రోడ్డు తవ్వవద్దని. వారు చెప్పిన తర్వాత కూడా రోడ్డు తవ్వుతావా? ఇక్కడ 30 దాకా కార్లు ఉన్నాయి. అందుకే ఇక్కడ రోడ్డు తవ్వవద్దని మేం మేయర్ ని అడిగాం. అందుకు అంగీకరించారు’’ అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.