KA Paul: ప్రగతి భవన్‌కు కేఏ పాల్, అప్పులు ఎలా తీర్చాలో చెబుదామని వచ్చినట్లు వెల్లడి - అడ్డుకున్న సెక్యురిటీ
అక్టోబర్ 2న ప్రపంచ శాంతి మహా సభ నిర్వహిస్తున్నానని, అందులో పాల్గొనడానికి ఆహ్వానం ఇచ్చేందుకు తాను వచ్చానని కేఏ పాల్ అన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం (జూలై 3) ఉన్నట్టుండి ప్రగతి భవన్ కు వచ్చారు. కానీ, లోనికి వెళ్లడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ ఫైర్ అయ్యారు. అఖిలేష్ యాదవ్ కు అపాయింట్‌మెంట్ ఇచ్చిన కేసీఆర్, తనకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నిలదీశారు. తాను అక్టోబర్ 2న ప్రపంచ శాంతి మహా సభ నిర్వహిస్తున్నానని, అందులో పాల్గొనడానికి ఆహ్వానం ఇచ్చేందుకు తాను వచ్చానని కేఏ పాల్ అన్నారు. దాని వల్ల తెలంగాణలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వచ్చానని కేఏ పాల్ చెప్పారు. అయినా పోలీసులు అనుమతించలేదని అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎలా తీర్చాలనే అంశంపై సీఎంతో చర్చిద్దామని అనుకున్నానని కేఏ పాల్ అన్నారు. సీఎం కేసీఆర్ ను కలవడానికి భేటీపై తన పార్టీ నేత ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించినప్పటికీ అనుమతి లభించలేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎంతో మాట్లాడాలని అనుకున్నట్లు చెప్పారు.
అఖిలేష్ కన్నా నేనే గొప్ప లీడర్ ని - కేఏ పాల్
అఖిలేష్ యాదవ్ కంటే తానే గొప్ప లీడర్‌ను అని, తనకు అపాయింట్ ఇవ్వాలంటూ తనదైన శైలిలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాంటి వాళ్లకు అపాయింట్మెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ తనకు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ని కలిసి రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నానని, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని కేఏ పాల్ గుస్సా అయ్యారు.