Jubilee Hills Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో వెలుగులోకి కొత్త ట్విస్ట్‌లు! కీలకంగా మారిన 17 మంది సాక్షులు
Hyderabad Gang Rape Case: ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇన్నోవా కారు నగరంలో తిప్పుతూ కారులోనే మైనర్ బాలికపై నిందితులు అత్యాచారం చేసినట్లుగా విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం.
Jubilee Hills Gang Rape Case Update: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 17 మంది సాక్షులను గుర్తించిన పోలీసులు ఇప్పటికే వీరిలో ఏడుగురిని విచారణ చేశారు. ఓ ప్రక్క సాక్షుల విచారణ, మరోవైపు ఇప్పటికే కస్టడీలో పూర్తయిన నిందితుల విచారణ.. ఇలా తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇన్నోవా కారు నగరంలో తిప్పుతూ కారులోనే మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు అత్యాచారం చేసినట్లుగా విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. మొదట మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్లే నడిపినట్లు ఇప్పటికే గుర్తించారు. అత్యాచారం జరిగిన ఇన్నోవా వాహనం వక్ఫ్ బోర్డు చైర్మెన్ ఉల్లాఖాన్ కారుగా పోలీసులు తేల్చేశారు. మొదట డ్రైవర్ తో పాటు ఇన్నోవా కారు పంపితే, నిందితులు డ్రైవర్ ను వెనక్కు పంపి మరీ కారును స్వాధీనం చేసుకున్నారు.
భరోసా సెంటర్ లో బాధితురాలు వాంగ్మూలం
బాలిక గొంతుపై గాట్లు ఉండటంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుకు ముందే బంజారాహిల్స్ లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో తల్లిదండ్రులు చికిత్స చేయించారు. తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానించి, బాలికను తీసుకెళ్లిన హాదీ ను ప్రశ్నించడంతో బాలికను తీసుకెళ్లింది.. ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో ఘటన బయటపడింది. దీంతో నిందితులకు బాధితుల తల్లిదండ్రుల కాల్ చేసి అడగడంతో బెదిరింపులకు దిగిన పరిస్దితి నెలకొన్నట్లు సమాచారం. ఇన్నోవా కారులోనే బాలికను ఐదుగురు అత్యాచారం చేసినట్లు ఆమె భరోసా సెంటర్ లో ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది.
నిందితుల్లో కనిపించని పశ్చాత్తాపం!
ఇదిలా ఉంటే గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసు కస్టడీలో విచారించిన సమయంలో వారి తీరు పోలీసులు సైతం విస్మయానికి గురయ్యేలా చేసింది. ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి, వేధించి, వీడియోలు చిత్రీకరించిన నిందితులు ఇప్పటికీ ఈ ఘటనపై కనీసం తప్పు చేశామనే పశ్చాతాపం కూడా లేకుండా ఉన్న తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. వీడియో లీకేజిపై నిందితుల మధ్య ఇప్పటికే పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం. అయితే వీరిలో వీడియో షూట్ చేసిన ఓ మైనర్ పై నిందితులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బెంజ్ కారు విషయంలో నిందితుల కుటుంబ సభ్యులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కారును పక్క ఇంట్లో దాచి లేదని నమ్మించే ప్రత్నం చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. ఆ తరువాత కారు నెంబర్ ఆధారంగా బెంజ్ కారును గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లైంగిక దాడి జరిగిన ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు చైర్మెన్ అధికారిక వాహనం కాదని తేల్చారు. వ్యక్తిగత వాహానానికి ప్రభుత్వ వాహనంగా స్టిక్కర్ వేసుకున్నట్లు గుర్తించారు. బాలికపై లైంగిక దాడి తరువాత on Govt Duty అనే స్టిక్కర్ ను తొలిగించినట్లు విచారణలో బయటపెట్టారు.