నడిరోడ్డుపై పోలీస్ అధికారి జులుం, బస్సు డ్రైవర్‌ను బూటు కాలితో తన్నిన సీఐ!
శాంతి భద్రతలు కాపాడాల్సిన కొందరు పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రజలను కాళ్లతో తన్నుతూ నడిరోడ్డుపై తిడుతూ అధికార జులుం ప్రదర్శిస్తున్నారు.
Jeedimetla CI Venkat Reddy:
శాంతి భద్రతలు కాపాడాల్సిన కొందరు పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రజలను కాళ్లతో తన్నుతూ నడిరోడ్డుపై తిడుతూ అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై రౌడీల్లా మారి దౌర్జన్యం చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా, అన్యాయాలను అరికట్టాల్సిన పోలీసులు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు. పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చ తీసుకువస్తున్నారు. ఇలాంటి ఘటనే భాగ్యనగరం హైదరాబాద్‌లో జరిగింది.
సైబరాబాద్‌లో జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి నడిరోడ్డుపై రౌడీలా ప్రవర్తించాడు. ఐడీపీల్ చౌరస్తా అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై ఓ బస్సు డ్రైవర్‌ను బూటు కాలితో తన్నాడు. ఉద్యోగంలో చేరే టప్పుడు చట్టాన్ని రక్షిస్తామని, పక్షపాతం చూపమని ప్రమాణం చేసిన సీఐ యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘించి దాడులకు దిగాడు. చుట్టూ పదిల సంఖ్యలో చూస్తున్నారనే ఆలోచన లేకుండా ప్రవర్తించాడు. బస్సు డ్రైవర్‌ను కాలితో తన్నుతూ, బూతులు తిట్టాడు. ఆపై డ్రైవర్ చెవులను పిండాడు. అతని చెంపల మీద తన చేతి ప్రతాపం చూపించాడు. సభ్య సమాజం తలదించుకునేలా, పోలీసులు అంటే క్రూరంగా ఉంటారని అనిపించేలా ప్రవర్తించాడు.
అధికారి జులుం చూసిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి కారణంగా ఖాకీల పరువు పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు విధించాలని, అంతేకాని చేయి చేసుకోవడం, కాలితో తన్నడం, చెంపలు పగలగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అక్కడే ఉన్న ప్రయాణికులు సైతం సీఐ తీరు చూసి అవాక్కయ్యారు. ఒక సీఐ ఇలా ప్రవర్తించడం ఏంటని చర్చించుకున్నారు.
డ్రైవర్‌పై సీఐ వెంకట్ రెడ్డి చేయి చేసుకోవడంపై పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిబంధనలు పాటిస్తూ బస్సులు బయటకు తీస్తున్నా సీఐ నిబంధనల పేరుతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనంటూ వాపోయారు. కావాలనే బస్సులను ఐడీపీఎల్ వద్ద ఆపుతూ హంగామా సృష్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏదైనా తప్పు, పొరపాటు చేస్తే చలానాలు విధించే అధికారం పోలీసులకు ఉందని, కానీ భౌతికంగా దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నెలవారి మామూళ్ల కోసమే సీఐ ఇలా దౌర్జన్యం చేస్తున్నారని ట్రవెల్ నిర్వాహకులు ఆరోపించారు.
ఆ సీఐ రూటే సెపరేటు అంటున్న ఖాకీలు
జీడిమెట్ల సీఐ వెంకట్ రెడ్డి రూటే సపరేటు అని డిపార్ట్‌మెంట్‌లో పేరుంది. ఎవరితోనా సులువుగా గొడవలు పెట్టుకోవడం ఆయనకు అలవాటని పలువురు పోలీసులే బహిరంగంగా చెప్పుకోవడం వివేషం. సదరు అధికారి స్టేషన్‌లో సిబ్బందితోను ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరిమాట వినకపోవడం, సిబ్బందిని బండ బూతులు తిట్టడం ఆయన నైజమని పలువురు చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వీడియాలు వైరల్
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా అమానుషం జరిగితే సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ని సీఐ వెంకట్ రెడ్డి కాలితో తన్నడం, చెంపకేసి కొడుతున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువత పెద్ద ఎత్తున షేర్ చేస్తూ సదరు అధికారి తీరును ప్రశ్నిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. అధికారి తీరును ఎండగడుతున్నారు. ప్రజలను చులకనగా చూసే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.