నేటి నుంచే ఉప్పల్ లో IPL పోరు, 215 మంది ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ కష్టాలకు చెక్
నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
IPL in Hyderabad: నేడు నగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ 2023 మ్యాచ్ కు సర్వం సిద్దమైయ్యింది. ఈ రోజు హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వైపు వెళ్లే మార్గాల్లో పలు సూచనలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మధ్యాహ్నం 3 గంటల తరువాత మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 4-వీలర్లు, 2-వీలర్లను కలిపి పార్కింగ్ చేయడానికి మొత్తం 18 పార్కింగ్ స్థానాలు అందుబాటులో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్, హబ్సిగూడ, తార్నాక నుంచి వచ్చే క్రికెట్ అభిమానులు తమ వాహనాలను IALA పార్కింగ్, పెంగ్విన్ టెక్స్‌టైల్ పార్కింగ్, 4 NGRI గేట్ నంబర్ 1 నుంచి 3, జెన్‌పాక్ట్ లేన్, జెన్‌పాక్ట్ నుంచి NGRI మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేసారు.
నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్రికెట్ అభిమానులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లుగా మెట్రో ప్రకటించింది. ఉప్పల్ స్టేడియంకు నేడు ఆర్టీసీ కూడా అదనపు బస్సులు నడుపుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
IPL Match in Hyderabad: నేటి నుండి మే 18 వరకు మొత్తం 215 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పార్కింగ్ స్థలాలు, సాధారణ ట్రాఫిక్ కోసం ప్రధాన మార్గాలు, స్టేడియంకు వెళ్లే మార్గాలతోపాటు స్డేడియం చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసే 8 సెక్టార్లలో పోలీసులు మోహరించారు. మ్యాచ్ కు వచ్చే క్రికెట్ అభిమానులు ఏక్ మినార్ మస్జిద్ రోడ్, స్టేడియం రోడ్ , హిందూ ఆఫీస్ రోడ్ నుండి స్టేడియంకు యాక్సెస్ రోడ్లలోకి చేరుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు, వేదిక మార్గాల్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా వాహనదారులకు కోసం 324 అనేక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
పార్కింగ్ ప్రాంతాల్లోకి ఎవరు ముందుగా వస్తే వారి వాహనాలు అదే క్రమ పద్దతిలో పార్క్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసారు.పార్కింగ్‌ను పార్కింగ్ రద్దీ నివారించడానికి, వేదికకు త్వరగా యాక్సెస్ చేయడానికి మెట్రో రైలు సేవలను కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ,అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సమాచారం అందించేందు ఎఫ్ ఎమ్ సేవలను సైతం వినియోగించుకుంటున్నారు.
IPL Tickets Booking: ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్స్ పూర్తి స్దాయిలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచడంతో ఈసారి వివాదాలకు చెక్ పెట్టినట్లయ్యింది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ నిర్వహణ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ జట్ల మధ్య వరుస మ్యాచ్ ల నేపధ్యంలో రద్దీ ప్రభావం మేనెల వరకూ ఉండనున్న నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రాతా చర్యలు చేపట్టారు.ఉప్పల్ వైపు వెళ్లే మార్గాలతో పాటు స్టేడియం చుట్టుప్రక్కలా సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా పెట్టారు. స్టేడియంలోపలికి ప్రవేశించే సమయంలో టిక్కెట్ చూపడంతోపాటు పూర్తి స్దాయిలో తనిఖీలు నిర్వహించిన తరువాత మాత్రమే లోపలికి పంపుతున్నారు. మొత్తానికి కాస్త గ్యాప్ తరువాత వచ్చిన ఐపీఎల్ సందడి హైదరాబాద్ లో కొత్త జోష్ నింపుతోంది.