Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
HYDRA: హైడ్రా కూల్చివేతలతోపాటు జరుగుతున్న పుకార్లకు చాలా మంది భయపడుతున్నారు. అలాంటి ఫేక్ ప్రచారంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇచ్చారు.
Hyderabad: హైదరాబాద్‌లో చాలా కాలం నుంచి హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. చెరువులను ఆక్రమించుకొని నిర్మించుకున్న కట్టడాలను నోటీసులు ఇచ్చి మరీ కూల్చస్తోందీ హైడ్రా. అందుకే హైడ్రా పేరు చెబితేనే అక్రమార్కుల గుండెళ్లో దడపుడుతోంది. అదే టైంలో చెరువులకు సమీపంలో ఇళ్లు నిర్మించుకున్న వాళ్లు కూడా భయపడుతున్నారు. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్ల తమ ఇళ్లపైకి వస్తాయో అని కంగారు పడుతున్నారు.
చుట్టుపక్కల మాటలు విని ఆత్మహత్య
ఇలాంటి కంగారుతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూల్చివేతలకు భయపడి కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ సూసైడ్ చేసుకుంది. ఆమెకున్న ముగ్గురు కుమార్తెలకు చెరో ఇంటిని రాసి ఇచ్చింది. ఇవి చెరువుకు సమీపంలో ఉండటంతో హైడ్రా కూల్చేస్తుందేమో అని కంగారు పడింది. మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Also Read: ఈ నెల 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక - ఆ రూట్‌లో ఐదు గంటలపాటు అస్సలు వెళ్లకండి!
ఆత్మహత్యతో సంబంధం లేదన్న రంగనాథ్
బుచ్చమ ఆత్మహత్య గురించి తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్... ఆమెను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. వాళ్ల ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోకే రాదని స్పష్టం చేశారు. అయితే చుట్టుపక్కల వాళ్ల మాటలతో బయపడి ఆమె ఆత్మహత్య చేసుకుందని హైడ్రాతో సంబంధం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో మూసీ నది పక్కన జరుగుతున్న కూల్చివేతలకు హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చాలా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను అధికారులు కూలుస్తున్నారు. హైడ్రాతో వాటితో సంబంధం లేదని అన్నారు రంగనాథ్. సోషల్ మీడియాలో, ఇతర మీడియాల్లో వచ్చే కథనాలు నమ్మొద్దని సూచించారు. అనవరమైన భయంతో ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని హితవు పలికారు.
కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
మరోవైపు హైకోర్టు కూడా హైడ్రా కూల్చివేతలపై స్పందించింది. గతంలో వేసిన రెండు పిటిష్లు విచారించిన న్యాయస్థానం... మరోసారి చట్టబద్ధతపై ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలతో కనీసం టైం ఇవ్వకుండా కూల్చివేతలు ఏంటని నిలదీసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్‌లో ఆసుపత్రి భవనం కూల్చివేతను తప్పపట్టింది. దీనిపై వ్యక్తిగతంగా ఈనెల 30న హాజరై వివరణ ఇవ్వాలని అమీన్‌పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది. ఆన్‌లైన్‌లో అయినా హాజరవ్వాలని చెప్పింది. నోటీసులు 21న సాయంత్రం అందజేసి 22 ఉదయం 7.30 గంటలకే కూల్చివేతలు మొదలు పెట్టిందని కోర్టుకు పిటిషన్‌దారులు తెలిపారు. దీనిపై కోర్టులో కేసు ఉన్నందున జోక్యం చేసుకోవద్దని ఉత్తర్వులు కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఇన్ని ఉన్నందున వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక్కరోజు కూడా సమయం ఇవ్వ కుండా కట్టడాలను కూల్చేయడాన్ని తప్పుపట్టింది. ఈ అంశంపై విచారణ ముగిసే వరకు నిర్మాణంలో ఉన్న భవనాలపై చేయి వేయరాదని గతంలో చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వాటికి విరుద్ధంగా ఎందుకు పని చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అనంతరం విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: హైదరాబాద్‌లో పోస్టర్లు, కటౌట్లపై నిషేధం - GHMC కఠిన నిర్ణయం