Hyderabad: హైదరాబాద్లో ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లంటూ ప్రచారం - ఖండించిన దక్షిణ మధ్య రైల్వే
Malakpet Railway station: హైదరాబాద్లో ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు వచ్చాయని వార్తలు వచ్చాయి. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు.
Malakpet Railway Station: హైదరాబాద్ నగరంలోని మలక్ పేట సమీపంలో లోకల్ ట్రైన్ కి భారీ ప్రమాదం తప్పిందని సోమవారం (జూలై 24) రాత్రి వార్తలు వచ్చాయి. ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు వచ్చాయని, ఈ ఘటన నగరంలోని మలక్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిందని ప్రచారం జరిగింది. ‘‘ఇది గమనించిన లోకో పైలట్లు అప్రమత్తమై, కొద్ది దూరంలోనే రైళ్లు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అరగంట పాటు రైళ్లను అలాగే ట్రాక్ మీద నిలిపివేశారు అధికారులు. పరిస్థితిని చక్కదిద్ది, అంతా ఓకే అనుకున్నాక మరో ట్రాక్ మీదకి ఒక్క ట్రైన్ ను మళ్లించారు రైల్వే అధికారులు. అయితే ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు’’ అంటూ వార్త సారాంశం.
అయితే, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వార్తపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఒకే ట్రాక్ పై రైళ్లు ఎదురెదురుగా రాలేదని వివరించారు. అంతా అబద్ధమని కొట్టిపారేశారు.