Hyderabad Rains: హైదరాబాద్ ను ముంచెత్తుతున్న వానలు - ముంపు అంచున పలు కాలనీలు
Hyderabad Rains: హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని రోడ్లున్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ తో పాటు అనేక ప్రాంతాలు ముంపు అంచున ఉన్నాయి.
Hyderabad Rains: భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తడసి ముద్దవుతోంది. భాగ్యననగరంలో ఉన్న చెరువులన్నీ నిండుకుండల్లా మారిపోయాయి. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జనదిగ్బంధం అయ్యాయి. కొన్ని చోట్ల నీరు బయటకు వెళ్లేందుకు వీలు లేక చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని బ్యాక్ వాటర్ తో కాలనీలను చుట్టుముట్టాయి. ఇందుకు ప్రధాన కారణం దాదాపు అన్ని చెరువులు కబ్జాలకు గురి కావడమే. చెరువుల్లోనే అనేక కాలనీలు పుట్టుకొచ్చాయి. పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కూడా వెలిశాయి. గుర్రం చెరువు, దుర్గం చెరువులు, సరూర్ నగర్ చెరువు, బతుకమ్మ చెరువుల, తీగల సాగర్ చెరువు, రాయసముద్రం చెరువు, చందం చెరువు, సాకి చెరువు, సూరారం పెద్ద చెరువు, తిమ్మక్క చెరువు, అప్పా చెరువు, పల్లె చెరువు, బాలాపూర్ పెద్ద చెరువులతో సహా చాలా ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలతో నామ మాత్రంగానే మిగిలిపోయాయి.
పూర్తిగా నిండిన 40 చెరువులు - కుమ్మరి కుంట తెగే అవకాశం
మరోవైపు భారీ వర్షాలతో సూరారం పెద్ద చెరువు పూర్తిగా నిండి పొంగిపోతుండగా వోక్షిత్ కాలనీ నీట మునిగింది. బండ్లగూడ చెరువు, నాగోల్ చెరువు, హయత్ నగర్ బాతుల చెరువు, కుమ్మరి కుంట, మన్సూరాబాద్ పెద్ద చెరువు, కుత్బుల్లాపూర్ లోని ఫాక్స్ సాగర్, గాజుల రామారం పర్కి చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. ఇప్పటికే సిటీలో 40 చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరాయి. కుమ్మరి కుంట తెగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దిగువ ప్రాంతాలైన అంబేడ్కర్ నగర్, లేబర్ బస్తీ, బంజారాకానీల్లోకి నీరు చేరుతుంది. పూర్తిగా నిండితే బ్యాక్ వాటర్ అంతా పద్మావతి కాలనీని చుట్టుముడుతుంది. బండ్లగూడ చెరువు బ్యాక్ వాటర్ తో అయ్యప్ప కాలనీకి పెను ప్రమాదమే పొంచి ఉంది.
157 చెరువుల ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించేందుకు నోటిఫికేషన్
నగరంలో చెరువుల పరిరక్షణ అయితే ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసంది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా వరకు చెరువులు, కాలనీలను, బస్తీలను ముంచెత్తాయి. దీంతో ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. సంవత్సరాలు గడుస్తున్నాపనులు పూర్తి కాలేవు. హడ్ఎండీఏ ఆధ్వర్యంలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ అన్ని చెరువులను ఎఫ్టీఎల్ సర్వే చేసింది. సిటీలో మొత్తం 185 చెరువులు ఉండగా... ఇందులో 157 చెరువుల ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 52 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి అయింది. వాటికే ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. మిగతా వాటిపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో వాటిని పక్కన పెట్టేశారు. దీంతో ప్రతీ సంవత్సరం భారీ వర్షాలు కురవడం... కాలనీలు, బస్తీలు అన్నీ నీటమునగడం పరిపాటిగా మారింది.
500లకు పైగా కాలనీలు, వారాలపాటు ముంపులోనే!
2020 అక్టోబర్ లో వచ్చిన వరదల కారణంగా దాదాపు 500లకు పైగా కాలనీలు కొన్ని వారాల పాటు ముంపులోనే ఉండిపోయాయి. దీంతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ముఖ్యంగా టోలిచౌకి నదీంకాలనీ, చాంద్రాయణగుట్టం అల్ జుబైర్ కాలనీలతో పాటు అనేక ప్రాంతాల్లో 10 ఫీట్ల లోతు వరద నీరు నిలిచి స్థానికులు అవస్థలు పడ్డారు. ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. కానీ ఇటీవలే కమిషనర్ రోనాల్డ్ రోస్ చెరువులను పరిశీలించారు. వర్షాకాలంలో చెరువులు నిండుతుండగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని నిర్ణయించారు. భారీ వానలకు చెరువులు పొంగిపొర్లితే ఏం చేయాలి అనే దానిపై అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని ప్రజలు సూచిస్తున్నారు. ఈ ఏడాది అయినా తమ ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా చూడాలని కోరుతున్నారు.