Hyderabad News: రాత్రంతా మహిళపై పీఎస్‌లో థర్డ్ డిగ్రీ - ఎల్బీ నగర్ పోలీసులపై కేసు నమోదు
LB Nagar Police: రాత్రంతా మహిళపై పీఎస్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వివాదంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఓ ఎస్సైపై ఎల్బీ నగర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
Case Filed against LB Nagar Police Who Beats Woman In PS:
హైదరాబాద్: ఎల్బీనగర్ లో మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనపై ఇదివరకే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని డీజీపీ, సీఎస్ లను ఆమె ఆదేశించారు. తాజాగా ఆదివారం నాడు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. రాచకొండ సీపీ చౌహాన్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకున్నారని ఆమె తెలిపారు. దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు.
ఓ మహిళను స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దాడి చేసిన ఘటనలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఓ ఎస్సైపై 324, 354, 379, ST SC POA ACT 2015 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితురాలి కూతురు పూజ ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 15న తన అంకుల్ చందుకి 3 లక్షల నగదు తీసుకెళ్తుండగా పోలీసులు డబ్బులు లాక్కుని దాడి చేశారని పిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లి తొడలు, మొకాళ్లు, చేతులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కులం పేరుతో దూషిస్తూ తల్లి పై దాడి చేశారని బాధితురాలి కూతురు ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..
ఆగస్టు 15 రాత్రి 11 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వారిని పీఎస్ కు తరలించారు. సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. తమను ఎందుకు తీసుకొచ్చారని మీర్‌పేటకు చెందిన మహిళ ప్రశ్నించగా.. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత ఆ మహిళను లాఠీలతో దారుణంగా కొట్టారు. రాత్రంతా స్టేషన్ లో ఉంచి లాఠీలతో కొట్టారని బాధితురాలు ఆరోపిస్తోంది. అలాగే తన శరీరంపై లాఠీతో కొట్టినట్లుగా ఉన్న గాయాలను కూడా చూపిస్తోంది. ఆగస్టు 15వ తేదీ రాత్రి సమయంలో తాను ఇంటికి వెళ్తుండగా.. పోలీసులు వచ్చి వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని.. సెల్ ఫోన్ లాక్కొని చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపించింది. బుధవారం ఉదయం తనను ఇంటికి పంపించినట్లు చెప్పింది. అయితే ఆమె చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజం కాదని.. ఎల్బీ నగర్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. మీర్ పేట నంది హిల్స్ లో బాధితురాలు నివాసం ఉంటుండగా... ఆమెతో పాటు ఆమె బంధువులు అందరూ పోలీస్టేషన్ లో ఆందోళనకు దిగారు.
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళిసై... మహిళపై జరిగిన దారుణ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ లను ఆదేశించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని శుక్రవారం ఆదేశించారు. బాధిత మహిళకు అండగా ఉండాలని రెడ్‌క్రాస్ సొసైటీకి గవర్నర్ సూచించారు.
ఇద్దరు పోలీసుల సస్పెండ్
ఈ కేసులో రాచకొండ సీపీ చౌహాన్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై వేటు వేశామని చెప్పారు. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశించారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ.. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.