Hyderabad News: చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ ఆడిట్ - మూసిన దారులు తెరిచే ప్రయత్నం
Hyderabad News: హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద మూసేసిన సగం రోడ్లను తెరిచేందుకు హైదరాబాద్ పోలీసులు మంగళవారం రోజు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు.
Hyderabad News: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద మూసివేసిన సగం దారులను తెరవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నారు. దీని ద్వారా చాలా వరకు ట్రాఫిక్ తగ్గించవచ్చని భావిస్తున్నారు. క్రమంలోనే చంద్రబాబు నివాసం వద్ద మంగళవారం సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ప్రధాన రహదారి నుంచి, రోడ్ నంబర్ 1, 45ల మీదుగా చంద్రబాబు నివాసానికి చేరుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ మూడు దారులనూ భద్రతా కారణాలతో మూసివేశారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ - జూబ్లీహిల్స్ కారిడార్ లో ట్రాఫిక్ మళ్లింపులతో పాటు మార్పులు చేస్తు్నారు. అంతర్గత రహదారుల్లో రాకపోకలను అనుమతిస్తున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలోనూ మూడు దారులను తెరిస్తే రద్దీని తగ్గించవచ్చని భావించారు.
ఈ క్రమంలోనే మంగళవారం తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ) డీఎస్పీ శ్రీనివాస రావు, ఏపీ ఐఎస్డబ్ల్యూ డీఎస్పీ రవీందర్ రెడ్డి సహా పలువురు ట్రాఫిక్, అగ్నిమాపక శాఖల అధికారులు ఇక్కడ పరిశీలించారు. చంద్రబాబు ముఖ్య భద్రతాధికారి మధుసూదన్ తో మాట్లాడారు. రోడ్ నంబర్ 1 నుంచి రోడ్ నంబర్ 65 దారితో పాటు రోడ్ నంబర్ 36లో హెరిటేజ్ పక్క నుంచి, రోడ్ నంబర్ 45 మీదుగా హెచ్ పీ గ్యాస్ ఎజెన్సీ పక్క నుంచి చంద్రబాబు నివాసానికి చేరుకోవచ్చు. రోడ్ నంబర్ 45 నుంచి వచ్చే వాహనాలను గ్యాస్ ఎజెన్సీ పక్కనున్న సందులోంచి రోడ్ నంబర్ 1కి మళ్లించాలని భావిస్తున్నారు. చంద్రబాబు నివాసం వద్ద మూసిన మొత్తం దారిలో సగం తెరిచి రాకపోకలను అనుమతించాలని చూస్తున్నారు.
ట్రాఫిక్ తగ్గించాలని యూటర్న్ లు - మరింత పెరిగిన ట్రాఫిక్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ - రోడ్ నెంబరు 45 - జర్నలిస్టు కాలనీ మధ్య ట్రాఫిక్ తగ్గించే లక్ష్యంతో నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన కొత్త ప్రయోగంపై వాహనదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ ట్రాఫిక్ మళ్లింపుల తీరు బాగా తికమకగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. వాహన రద్దీ తగ్గించాలని పోలీసులు కొత్తగా వేసిన ఈ ప్లాన్, వాహనాలు సాఫీగా వెళ్లడం మాట అటుంచితే, ట్రాఫిక్ మరింత పెరిగింది. అనేక చోట్ల యూ టర్న్ లు ఉండడం, వాహన చోదకులు కన్‌ఫ్యూజ్ అయి మెల్లగా వాహనాలు నడుపుతుండడం కూడా వాహనాల రద్దీ పెరిగేందుకు కారణంగా తెలుస్తోంది.
వాహనాల రద్దీగా ఉన్న సమయంలోనూ అసలైన దారిలో వెళ్తే పట్టే సమయం కన్నా ఈ డైవెర్షన్‌ల మార్గాల ద్వారా వెళ్తే పావు గంట నుంచి అర గంట వరకూ ఎక్కువ సమయం పడుతోందని చెబుతున్నారు. దీంతో సరైన సమయానికి గమ్యస్థానం చేరలేకపోతున్నామని, ఆఫీసులకు ఆలస్యం కూడా అవుతుందని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ చుట్టూ 8 ప్రాంతాలను అత్యధిక ట్రాఫిక్ ఏరియాలుగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు.