Hyderabad News: 1995లో రూ.4 కోట్లు దోచేశాడు - 28 ఏళ్లకి పోలీసులకు చిక్కాడు!
Hyderabad News: 1995లో జరిగిన ఆర్థిక నేరం కేసులో నిందితుడిని సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. 28 ఏళ్ల తర్వాత నిందితుడిని ఇండోర్ లో అరెస్టు చేశారు.

Hyderabad News: నిజం ఎప్పటికైనా బయట పడుతుంది, నిందితుడు ఎప్పటికైనా పట్టుబడతాడు. ఇవి చాలా ఫేమస్ కొటేషన్స్. ఏదైనా నేరం చేసి పోలీసులకు దొరక్కుండా వారం, నెల, ఏడాది, కొందరు నేరగాళ్లు అయితే ఏకంగా సంవత్సరాల తరబడి తప్పించుకు తిరుగుతారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు వారు చేసే చిన్న తప్పు వల్ల అడ్డంగా దొరికిపోతారు. అచ్చంగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది.
ఈ కేసులో నిందితుడు అయిన వ్యక్తి ఒకటి రెండూ కాదు ఏకంగా 28 సంవత్సరాలు తప్పించుకు తిరిగాడు. ఆ నిందితుడిని తాజాగా అధికారులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూర్ పోలీస్ స్టేషన్ లో 1995లో నమోదైన కేసులో నిందితుడు వీఎస్ క్షీర్ సాగర్ ను అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా, కొత్తూరు మండలం నందిగోన్ గ్రామ పరిధిలో 1995లో వానిసింగ్ కంపెనీ పేరిట ఓ స్టీల్ కంపెనీని స్థాపించారు. స్థానికులకు కంపెనీలో షేర్లు ఇస్తామని, లాభాలు వచ్చాక వాటిని పంచుతామని చెప్పి వానిసింగ్ కంపెనీ నిర్వాహకులు మాయమాటలు చెప్పి స్థానికుల నుండి రూ. 4.3 కోట్లు వసూలు చేశారు. ఈ మొత్తంలో రూ. 4 కోట్లను 1995లో ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ లో దాదర్ బ్రాంచ్ లో బ్రాంచ్ మేనేజర్ గా పని చేస్తున్న వీఎస్ క్షీర్ సాగర్ కొట్టేశాడు.
వానిసింగ్ కంపెనీ దివాళా తీయడంతో ఆ కంపెనీలో షేర్లు కొన్న ఎంతో మంది సామాన్య ప్రజలు డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వీఎస్ క్షీర్ సాగర్ పై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును ఎట్టకేలకు అమలు చేస్తూ నిందితుడిని ఇండోర్ లో పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడు వీఎస్ క్షీర్ సాగర్ అరెస్టులో కీలకంగా పని చేసిన సీఐడీ ఇన్ స్పెక్టర్ ఎస్ వెంకటేశ్, ఎస్సై పి. నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ ఎం. గోపాల్ లను సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అభినందించారు.
గతేడాది హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే.. కానీ వారానికే చిక్కిన నిందితుడు
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ క్యాషియర్ చేసిన పనికి ఉద్యోగులతో పాటు అంతా షాక్ అయ్యారు. వనస్థలిపురంలోని బ్రాంచ్‌లో రూ. 22.53 లక్షల నగదు మాయం అవ్వడంతో అధికారులు ఎవరు చేశారనే కోణంలో తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో క్యాషియర్ ప్రవీణ్ పై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. క్యాషియర్ ప్రవీణ్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. మంగళవారం మధ్యాహ్నం రూ.22.53 లక్షలు డబ్బు తీసుకుని పారిపోయినట్లు పోలీసులు అధికారులకు తెలిపారు.
బెట్టింగ్‌లో వస్తే ఓకే.. లేకపోతే డౌటే!
తాను క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు మొత్తం కోల్పోయానని, అయితే వాటిని రాబట్టేందుకు బ్యాంక్ నుంచి మరింత నగదు తీసుకెళ్లానని, ఈసారి బెట్టింగ్‌లో డబ్బులు వస్తే బ్యాంకుకు కట్టేస్తానని క్యాషియర్ ప్రవీణ్ ఇదివరకే పేర్కొన్నాడు. ఒకవేళ తనకు డబ్బులు తిరిగి రాకపోతే సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఉందని సైతం చెబుతూ ట్విస్ట్ ఇచ్చాడు. వారణాసిలో ఉన్నానని పోలీసుకు చెప్పి తప్పుదోవ పట్టించిన ప్రవీణ్ గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు గుర్తించారు. నేడు హయత్ నగర్ కోర్టుకు వచ్చి నేరుగా లొంగిపోయి బ్యాంకు సిబ్బందికి, పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు క్యాషియర్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

