Hyderabad News: సంతకం ఫోర్జరీ చేశారని జనగామ ఎమ్మెల్యేపై కుమార్తె కేసు- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భావోద్వేగం !
Hyderabad News: జగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Hyderabad News: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఈ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎకరా ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీకుసున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఈ భూమిపై తీవ్ర వివాదం నడుస్తోంది. చెరువు భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారంటూ విపక్షాల ఆరోపించాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయితే ఇదే విషయమై తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భవాని రెడ్డి ఫిర్యాదుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు అయ్యాయి.
కావాలనే ప్రత్యర్థులు నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు..!
తన కూతురు తనపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యర్థులు కావాలనే కుట్ర పన్ని తమ కుటుంబంలో చిచ్చులు పెట్టాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చేర్యాలలోని సర్వే నంబర్ 1402లో 1200 గజాల స్థలం తన కూతురు పేరుపై రిజిస్టర్ చేసిందని.. ఇందులో ఎలాంటి ఫోర్జరీ లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు పేరు మీద 125 నుండి 150 గజాల స్థలం ఉందని.. అందులోనూ ఎలాంటి ఫోర్జరీ లేదని చెప్పుకొచ్చారు. కిరాయి నామా దస్తావేజు తనకు తెలియకుండా తన కుమారుడు మార్చారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు.
గతంలో కలెక్టర్ దేవసేనతో గొడవ పడ్డ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఖాళీ జాగా కనిపిస్తే ముత్తిరెడ్డి కబ్జా చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. నోటి దురుసుతనం, వ్యవహార శైలితో అటు నియోజకవర్గంలోనూ ఇటు బయట కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు ముత్తిరెడ్డి. యశ్వంతపూర్ లో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించారని గతంలో హైకోర్టుకు వెళ్లారు మాజీ సర్పంచ్. బతుకమ్మకుంట భూఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి గొడవ కూడా జరిగింది. నర్మెట్ట మండలం హన్మంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. చేర్యాల మండల కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలను ఆక్రమించి ముత్తిరెడ్డి ప్రహారీ నిర్మించారని విమర్శలు వచ్చాయి. ఇదే విషయంపై గతంలో అఖిలపక్షం ఆందోళనకు దిగి చేర్యాల బంద్ కు పిలుపునిచ్చింది. గొల్ల కురుమలు జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని కూడా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వదల్లేదని ఆరోపణలు ఉన్నాయి.