Hyderabad News: ర్యాగింగ్ పేరుతో సీనియర్ల అరాచకాలు, 34 మంది విద్యార్థుల సస్పెండ్!
Hyderabad News: పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కు పాల్పడ్డ 34 మంది సీనియర్ విద్యార్థులపై విశ్వవిద్యాలయం కఠిన చర్యలు తీసుకుంది. వారిని రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.
Hyderabad News: అప్పుడే కళాశాలలో అడుగుపెట్టిన జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికి, మేమున్నామంటూ భరోసా కల్పించాల్సిన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో నరకం చూపించారు. ఎంసెట్ లో మెరుగైన ర్యాంకులు సాధించి ఎన్నెన్నో ఆశలతో క్యాంపస్ లోకి వచ్చిన వారిపై తమ ప్రతాపం చూపించారు. ఈ వేధింపులను తట్టుకోలేని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయగా.. అంతర్గత కమిటీ వేసి బాధితులు చెబుతున్న మాటలు ఆరోపణలు కాదని, నిజంగానే సీనియర్లు వారిని వేధింపులకు గురి చేసినట్లు తేల్చారు. బాధ్యులైన నాలుగో సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్న 34 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ నుండి సస్పెండ్ చేశారు. వీరిలో 25 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుండి మరో 9 మంది స్టూడెంట్స్ ను హాస్టళ్ల నుంచి అలాగే విశ్వ విద్యాలయంలోని వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధం విధించింది పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వ విద్యాలయం.
సీనియర్లు వేధిస్తున్నారంటూ ప్రన్సిపాల్ కు ఫిర్యాదు..!
రాజేంద్రనగర్ లోని పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలో డిగ్రీ(బీవీఎస్సీ) కోర్సు రెండో, నాలుగో సంవత్సరం చదువుతున్న 34 మంది విద్యార్థులు... ఇటీవలే క్యాంపస్ లో కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. నానా రకాలుగా జూనియర్ విద్యార్థులను తీవ్రంగా హింసించారు. వారి వేధింపులు తట్టుకోలేని జూనియర్ విద్యార్థులు.. వాళ్లు పడుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వ విద్యాలయ ప్రిన్సిపాల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. జూనియర్ విద్యార్థులు చేసిన ఆరోపణలపై ప్రిన్సిపల్ ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేశారు. వేధింపులు ఎదుర్కొన్న జూనియర్ విద్యార్థులతో పాటు, ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్లను, మిగతా విద్యార్థులను సైతం ప్రొఫెసర్ల కమిటీ విచారించింది.
ర్యాగింగ్ చేసింది నిజమేనని వెల్లడించిన వర్సిటీ..
అన్ని కోణాల్లో ప్రశ్నలు సంధించిన కమిటీ.. ర్యాగింగ్ జరిగింది వాస్తవమేనని గుర్తించింది. బీవీఎస్సీ రెండో సంవత్సరం, నాలుగో సంవత్సరం చదువుతున్న సీనియర్ విద్యార్థులు, జూనియర్ స్టూడెంట్స్ ను ర్యాగింగ్ పేరుతో వేధించింది వాస్తవమేనని గుర్తించింది. జూనియర్లు చేసిన ఆరోపణలు నిజాలే అని నిగ్గు తేల్చింది. ఈ మేరకు ప్రొఫెసర్ల కమిటీ పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ కు నివేదించింది. ఈ మేరకు 34 మంది సీనియర్లపై విశ్వవిద్యాలయం చర్యలు తీసుకుంది. ర్యాగింగ్ చేయడం, హింసించిన బాధితులు వివరించడంతో బాధ్యులను రెండు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం వర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కఠిన చర్యలు ఉంటాయని వర్సిటీ వివరించింది.
20 మంది సీనియర్లు తీవ్రంగా వేధించడం వల్లే..
ఈ మధ్య హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులను సుమారు 20 మంది సీనియర్లు తీవ్రంగా వేధించడంతో దీంతో బాధిత విద్యార్థి ఒకరు ఈనెల 25న దిల్లీలోని యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ రాక్షస క్రీడలో మొత్తం 20 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న ఏడుగురిని ఓ సెమిస్టర్ పాటు తరగతుల నుంచి, డిగ్రీ పూర్తయ్యే వరకు వసతి గృహం నుంచి సస్పెండ్ చేశారు. మరో 13 మందిని వసతి గృహం నుంచి సస్పెండ్ చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు.